ఎయిరిండియా విమానం ప్రమాదం వెనుక..కుట్రా?: బ్లాక్ బాక్స్ ఏం చెబుతోంది?
Air India flight crash: దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం అయింది. బ్లాక్ బాక్స్ లభించిన తరువాత కుట్ర కోణం సైతం వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దిశగా విచారణ చేపట్టింది.
ఈ దుర్ఘటనపై ప్రస్తుతం విమాన ప్రమాద పరిశోధన బ్యూరో (AAIB) దర్యాప్తు కొనసాగిస్తోంది. కుట్ర కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.

జూన్ 12వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు టేకాఫ్ తీసుకున్న ఎయిర్ ఇండియా ఏఐ 171 బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానం కొద్దిసేపటికే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
విమానం టేకాఫ్ అయిన వెంటనే మెఘానినగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఆ తరువాత మంటలు చెలరేగాయి. విమాన ప్రయాణికులు, సిబ్బందితో పాటు ఈ ప్రమాదంలో కాలేజీకి చెందిన తొమ్మిది మంది విద్యార్థులు, వారి బంధువులు కూడా మరణించారు.
ఈ ప్రమాదం చాలా అరుదైనదని కేంద్రమంత్రి మురళీధర్ మహోల్ అభివర్ణించారు. రెండు ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడం ఎప్పుడూ జరగలేదని అన్నారు. రెండు ఇంజిన్లు ఎందుకు పనిచేయడం ఆగిపోయాయనేది విచారణ నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని అన్నారు.
బ్లాక్ బాక్స్‌లో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ఉందని, అందులో ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణ రికార్డయిందని పేర్కొన్నారు. వాళ్లు ఏం మాట్లాడుకున్నారనది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. సమగ్ర నివేదిక మూడు నెలల్లో వస్తుందని పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత ప్రయాణికులు విమాన ప్రయాణం గురించి భయపడటం సహజమేనని మురళీధర్ మహోల్ అన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాల మేరకు అన్ని డ్రీమ్ లైనర్లను తనిఖీ చేశామని, అవన్నీ సురక్షితంగా ఉన్నాయని తేలిందని చెప్పారు.
ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థలు సొంతంగా ఉద్యోగాల నియామకాలు చేసుకోకూడదని ఆయన తేల్చి చెప్పారు. డీజీసీఏ అనుమతి లేకుండా ఎలాంటి నియామకాలు జరగబోవని అన్నారు. ప్రైవేట్ ఎయిర్ లైన్స్ యాజమాన్యాలు ఎవరిని పడితే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోలేవని, కొన్ని అర్హతలు తప్పనసరిగా ఉండాలని చెప్పారు.












Click it and Unblock the Notifications