సుబ్రతారాయ్ విడుదల కోసం: 1,211 కోట్లకు భూమి విక్రయం, మరికొన్నీ...
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌ను తీహార్ జైలు నుంచి విడిపించేందుకు వీలుగా నిధులను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్న ఆ సంస్థ గుర్గావ్ సమీపంలో గల భూమిని గురువారం రూ.1,211 కోట్లకు ప్రముఖ రియాల్టీ సంస్థ ఎం3ఎం ఇండియా లిమిటెడ్‌కు అమ్మింది.
అలాగే పుణేలో మరో భూమిని అమ్మేందుకు సహారా గ్రూప్ జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఇదే విధంగా ముంబయిలోని వసాయి, రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లలో గల మరో రెండు భూములను కూడా 1,250 కోట్లకు అమ్మేందుకు సహారా గ్రూప్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ రెండు ఒప్పందాలకు సంబంధించి సహారా గ్రూప్ నుంచి ఇప్పటివరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. గుర్గావ్‌లో సహారా గ్రూప్ సంస్థకు చెందిన 185 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఈ ఏడాది ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద లావాదేవీ కావచ్చని ఎం3ఎం ఇండియా వెల్లడించింది.
సహారా గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన భూమిని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటామని, రానున్న 6-8 సంవత్సరాల్లో ఈ భూమి ద్వారా 12వేల కోట్ల రాబడి వస్తుందని భావిస్తున్నామని ఎం3ఎం ఇండియా డైరెక్టర్ పంకజ్ బన్సాల్ తెలిపారు.

సహారా సంస్థ ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఈ భూమిని చౌకగా ఏమీ కొనుగోలు చేయలేదని, మార్కెట్ ధర ప్రకారం రెండు నెలల క్రితమే ఈ భూమిని కొనుగోలు చేశామన్నారు. ఈ భూమి కొనుగోలు ఒప్పందాన్ని సుప్రీం కోర్టు ఆమోదించాల్సి ఉందన్నారు.
సహారా సంస్థకు చెల్లించాల్సిన డబ్బును వాయిదాల రూపంలో ఆరు నెలల్లో చెల్లిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ డేటెడ్ చెక్కులను ఆ సంస్థకు సహారా గ్రూప్‌కు అందజేసినట్లు చెప్పారు. సహారా నుంచి కొనుగోలు చేసిన స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ డెవలర్లను, ఆర్థిక సంస్థలు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలను నియమించుకుంటామని వెల్లడించారు.
ఇందుకోసం 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. గుర్గావ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎం3ఎంకి 2,000 ఎకరాల స్థలం ఉంది. 75 ఎకరాల విస్తీర్ణంలో గోల్ఫ్ ఎస్టేట్‌తో సహా, 14 ప్రాజెక్టులను నిర్మిస్తోంది. 2014లో అతిపెద్ద భూ లావాదేవీ ఇదే కావొచ్చని గుర్‌గావ్ ఒప్పందం అనంతరం ఎం3ఎం ఇండియా డైరెక్టర్ పంకజ్ బన్సల్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications