సాయిబాబా ముస్లీం, జైలులో పెట్టినా...: స్వరూపానంద
హరిద్వార్: సాయిబాబా దేవుడే కాదని, ఆయణ్ణు పూజించిన వారు రాముడిని పూజించకూడదని, గంగానదిలో స్నానం చేయవద్దని ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా తనకు తాను ముస్లింగా చెప్పుకున్నారని, అలాంటపుడు ఆయన విగ్రహానికి గంగానదిలో పదేపదే స్నానాదికాలు చేయించడమెందుకని ప్రశ్నించారు.
తాను హిందూమత రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. తనను జైలుకు పంపించినప్పటికీ తాను హిందూమతం కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. తాను జైలుకు వెళ్లినా, తన దిష్టిబొమ్మలను దగ్ధం చేసినా తాను హిందూమతం కోసమే తాపత్రయపడతానన్నారు.

కంఖల్‌లో జరిగిన భారత్ సాధు సమాజ్ సమావేశంలో స్వరూపానంద మాట్లాడారు. సాయిబాబా ముస్లిం ఫకీర్ మాత్రమేనని చెప్పారు. అలాంటి వ్యక్తిని హిందు దేవతలతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. హిందూమతాన్ని కొందరు మలినం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
కాగా, స్వరూపానంద వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. షిర్డీలో ఆదివారం మహిళా భక్తులు షబానా సయ్యద్ అనే మహిళ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. స్వరూపానంద చిత్రపటానికి గాజులు పెట్టారు. ఆయన వెంటనే షిర్డీకి వచ్చి సాయి సన్నిధిలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications