ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మళ్లీ శామ్ పిట్రోడా
కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారతీయుల శరీరాకృతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడాను తిరిగి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. గత నెలలో దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
తూర్పు ప్రాంతంలోని భారతీయులు చైనీయులను పోలి ఉంటారని, దక్షిణాదిలో ఉన్నవారు ఆఫ్రికన్లుగా కనిపిస్తారని పిట్రోడా వ్యాఖ్యలు చేయడంతో వివాదం రేగింది. ఈ నేపథ్యంలో మే 8న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అప్పుడు ఆమోదించారు.

శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన ప్రకటనకు కాంగ్రెస్ దూరంగా ఉంది. అంతేగాక, వాటిని ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. అయితే, తాజాగా, కాంగ్రెస్ మళ్లీ శామ్ పిట్రోడా (సత్యన్నారాయణ గంగారామ్ పిట్రోడా)కు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, ఎన్నికల సమయంలో శామ్ పిట్రోడా.. వారసత్వ పన్ను విధానంపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. అమెరికాలోని ఓ విధానాన్ని ఉటంకిస్తూ.. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని శామ్ పిట్రోడా చెప్పడం తీవ్ర దుమారాన్ని రేపింది. అయితే, పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ కాంగ్రెస్ పేర్కొంది.












Click it and Unblock the Notifications