నేనూ క్యాన్సర్ బారిన పడ్డా, ఆ సమయంలో - సంజయ్ దత్ ఎమోషనల్..!!
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఎమోషనల్ అయ్యారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, ఆ మహమ్మారిపై పోరాటానికి మనో ధైర్యం కావాలని పేర్కొన్నారు. తన తల్లి క్యాన్సర్ కారణంగా మరణించారని.. తాను కొన్నేళ్ల క్రితం నేనూ లంగ్ క్యాన్సర్ బారిన పడ్డానని వెల్లడించారు. క్యాన్సర్ రోగులకు కీలక సూచనలు చేసారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని పలు విభాగాలను సందర్శించారు. ముఖ్యంగా చిన్నారుల వార్డుకు వెళ్లి పిల్లలను పలకరించారు. వారిని ఉత్సాహ పరుస్తూ బహుమతులు అందించారు. తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. తన తల్లి క్యాన్సర్ కారణంగా తమను విడిచిపెట్టారని చెప్పుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం తానూ ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డానని వెల్లడించారు. కానీ ధైర్యం కోల్పోకుండా... వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నట్లు చెప్పుకొచ్చారు. క్యాన్సర్ గుర్తించిన వెంటనే ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ముందస్తుగా క్యాన్సర్ ను గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా పూర్తిగా కోలుకొనే అవకాశం ఉందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ చికిత్స లో ఎంతో సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.

సంజయ్ దత్ ఉద్విగ్న వ్యాఖ్యలు
ఒక వయసు వచ్చిన తరువాత క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచన చేసారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స పొందవచ్చని వివరించారు. చికిత్స కంటే మనోధైర్యమే పెద్ద మందుగా పని చేస్తుందని చెప్పారు. క్యాన్సర్‌ను చూసి భయపడవద్దని... వైద్యులపై నమ్మకం ఉంచి ధైర్యంగా పోరాడితే తప్పకుండా విజయం సాధించవచ్చని చికిత్స పొందుతున్న రోగులకు సందేశం ఇచ్చారు. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా అందిస్తున్న సేవలను నందమూరి బాలకృష్ణ వివరించారు. తమ లక్ష్యాలను స్పష్టం చేసారు. క్యాన్సర్ రోగులకు స్వాంతన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.













Click it and Unblock the Notifications