రాజకీయ రచ్చ: బిజెపి వైపు సంజయ్ దత్ చూపు!
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన భారతీయ జనతా పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి ప్రజలకు దూరంగా ఉన్న ఆయన.. తాజాగా బిజెపి సమావేశంలో పాల్గొనడం రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
ఈ కార్యక్రమంలో బిజెపి యూత్ వింగ్ నేత మోహిత్ కాంబోజ్ ఆధ్వర్యంలో జరిగింది. కాగా, కాంబోజ్‌ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలంటూ సంజయ్ దత్ తోపాటు ఇతరులు స్థానిక ప్రజలను కోరారు. కాగా, శిక్షాకాలం పూర్తవడంతో సంజయ్ దత్ జైలు నుంచి గత ఫిబ్రవరిలో విడుదలైన విషయం తెలిసిందే.
కాంగ్రెస్‌తో సంజయ్ దత్ కుటుంబానికి చాలా ఏళ్లుగా మంచి సంబంధాలున్నాయని, సంజయ్ ను బిజెపి కార్యక్రమానికి ఆహ్వానించడం తప్పని ముంబై కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ అన్నారు.

శివసేన కూడా బిజెపి తీరుపై మండిపడింది. మహారాష్ట్రపై నిజమైన ప్రేమే ఉంటే.. సంజయ్ దత్ ను బిజెపి తమ సమావేశానికి ఆహ్వానించేది కాదని ముంబై మాజీ మేయర్ సునీల్ ప్రభు అన్నారు. 2014 ఎన్నికల్లో కాంబోజ్‌ను శివసేన అభ్యర్థి సునీల్ ప్రభు ఓడించారు.
కాగా, దత్ తనకు ఎంతో కాలంగా మంచి స్నేహితుడని, ఈ నేపథ్యంలోనే సమావేశానికి ఆహ్వానించామని కాంబోజ్ తెలిపారు. ఇందుకు సీనియర్ పార్టీ నేతల నుంచి అనుమతి కూడా తీసుకున్నానని చెప్పారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆయడ్ని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించారు. కాంబోజ్ ఆహ్వానం మేరకు సంజయ్ దత్ మహారాష్ట్ర ఉత్సవాల్లో పాల్గొన్నారని, ఇందులో రాజకీయం ఏమీ లేదని ముంబై బిజెపి చీఫ్ ఆశీష్ షెలార్ తెలిపారు.












Click it and Unblock the Notifications