పన్నీరుసెల్వం ఊహించని ట్విస్ట్, అప్రమత్తమైన శశికళ.. రిసార్ట్‌కు
ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించకపోవడంతో.. శశికళ ఈ రోజు నిరసనలకు, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎదుట తన ఎమ్మెల్యేలతో పరేడ్ చేయాలని భావిస్తున్నారు.
చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శశికళ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించకపోవడంతో.. శశికళ ఈ రోజు నిరసనలకు, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎదుట తన ఎమ్మెల్యేలతో పరేడ్ చేయాలని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శశికళకు పన్నీరు అసలుకే ఎసరు తెస్తున్నారు. ఆయన ఏకంగా శశికళ ఎమ్మెల్యేలను బంధించిన రిసార్టులకు వెళ్లి వారిని కలుసుకోవాలని భావిస్తున్నారు. తన వర్గంలో చేరిన మంత్రి ద్వారా వివరాలు తెలుసుకున్న పన్నీరు.. ఈ రోజు రిసార్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే, శశికళ అనుకూల వర్గంలో ఒక్కొక్కరుగా పన్నీరు పంచన చేరుతుండటంతో సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎంపీలు పన్నీరుకు మద్దతు పలికారు. ఏడుగురు ఎమ్మెల్యేలు పన్నీరు శిబిరంలో చేరారు. దీంతో శశికళ వర్గంలో కలవరం మొదలైంది. శశికళ వెంట ఉంటే భవిష్యత్ ఉండదనే ఆందోళన వారిలో నెలకొంది.

దీంతో రిసార్ట్‌లో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు పన్నీరు వెంట నడవాలని భావిస్తున్నారు. ఇదే సరైన సమయం అని భావిస్తున్న పన్నీరు వారి వద్దకు వెళ్లనున్నారు. అయితే పన్నీరు కలవడానికి వెళితే శశికళ అనుచరులు అడ్డుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో వెళుతున్న పన్నీరును అడ్డుకునేంత అవకాశం వారికి ఉండదని కూడా అంటున్నారు. శశికళ రిసార్ట్‌లో ఉంచిన ఎమ్మెల్యేలను కలవడం ద్వారా సగం మందికి పైగా ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవచ్చని పన్నీరు భావిస్తున్నారు.
కొందరు ఎమ్మెల్యేలను శశికళ బలవంతంగా ఆ హోటల్‌లో ఉంచారనే వార్తలొస్తుండటంతో పన్నీరు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నీరు ఆ రిసార్ట్‌లో పర్యటిస్తే శశికళ మద్దతుదారులు ఇక ఆశలు వదులుకోక తప్పదని అంటున్నారు. మరోవైపు, పన్నీరు వెళ్లనున్న నేపథ్యంలో శశికళ అప్రమత్తమయ్యారు. మరోసారి ఆమె రిసార్టుకు వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications