సహనాన్ని పరీక్షించొద్దు: శశికళ, చెన్నైలోకి అల్లరిమూకలు!, గవర్నర్ సీరియస్
తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడి రాజుకుంటున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం వేగంగా పావులు కదుపుతోంది.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడి రాజుకుంటున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం వేగంగా పావులు కదుపుతోంది. దీంతో క్షణక్షణం ఉత్కంఠగా మారుతోంది. శనివారం సాయంత్రం పోయేస్ గార్డెన్ నుంచి ముగ్గురు మంత్రులు, ఎంపీ తంబిదురైతో కలిసి గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లారు శశికళ.
నేరుగా రాజ్‌భవన్‌కు..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఎమ్మెల్యేలంతా ఓపిగ్గా ఉండాలని కోరినట్లు తెలిసింది. రిసార్టులో ఎమ్మెల్యేలతో భేటీ అయిన శశికళ.. ఆ తర్వాత నేరుగా ఎమ్మెల్యేలను తీసుకుని రాజ్ భవన్‌కు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను చూపించి బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
'అమ్మ 1.5 కోట్లమంది పార్టీ సోదరులను, సోదరీమణులను నా చేతిలో పెట్టి వెళ్లింది. వాళ్లంతా నా పక్షాన ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు' అంటూ పన్నీర్ సెల్వంని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. 'అమ్మ ఎవర్ని నమ్మి పార్టీని చేతిలో పెట్టిందో వారే పార్టీని చీల్చేందుకు కృషి చేస్తున్నారు' అంటూ ఆరోపించారు.

కాగా, ఇప్పటికే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ కూడా రాశారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేసి ఏడు రోజులు గడిచిపోయాయని.. ఇంకా ఆలస్యం చేయకూడదని శశికళ లేఖలో కోరారు. శనివారం సాయంత్రం 4.30గంటలకు గవర్నర్ నుంచి పిలుపువస్తుందని శశికళ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ గవర్నర్ అపాయింట్ మెంట్ దొరికితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని కోరనున్నట్లు తెలిసింది.
శశికళ హెచ్చరికలు చేశారా?: చెన్నైలో అల్లరి మూకలు!
రిసార్టులో ఎమ్మెల్యేలతో మాట్లాడిన శశికళ హెచ్చరికలు చేశారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఒక వేళ తనకు మంచి జరగకుంటే ఏం చేయాలో తనకు తెలుసు అని శశికళ ఎమ్మెల్యేలతో అన్నట్లు సమాచారం. అంతేగాక, తమ సహనాన్ని పరీక్షించొద్దని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
కాగా, ఈ వ్యాఖ్యలను గవర్నర్ విద్యాసాగర్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని లాడ్జీలు, రిసార్టుల్లో ఉన్న వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీంతో చెన్నై కమిషనర్ నగరంలోని అన్ని లాడ్జీలు, రిసార్టులు, హోటళ్లలో తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఇప్పటికే చెన్నైలో అల్లరి మూకలు చేరినట్లు సమాచారం. గవర్నర్ ప్రకటన వెలువడగానే నగరంలో అలజడి సృష్టించేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.












Click it and Unblock the Notifications