కస్టమర్ల డేటా లీక్ నిజమే ? SBI సంచలన ప్రకటన- రంగంలోకి సైబర్ టీమ్స్..!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల డేటా లీక్ వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు డార్క్ వెబ్‌లో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన సమాచారం బయటపడినట్లు వచ్చిన హెచ్చరిక నేపథ్యంలో ఈ ఘటనపై ఎస్‌బీఐ అధికారికంగా స్పందించింది. ఇవాళ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లకు సమర్పించిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.
అక్టోబర్ 16న తొలిసారి ఎస్బీఐకి చెందిన థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నుంచి హెచ్చరిక అందింది. డార్క్ వెబ్‌లో బ్యాంకు ఖాతాదారుల డేటా బయటపడినట్లు ఆ హెచ్చరికలో పేర్కొన్నారు. డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్న సుమారు 3,75,000 రికార్డులను పరిశీలించగా, వాటిలో 3,897 ఖాతాదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో కూడిన రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమాచారంలో ఖాతాదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, పేర్లు, ఇమెయిల్ చిరునామాలు, నివాస చిరునామాలు, బ్రాంచ్ వివరాలు, CIF గుర్తింపు నంబర్లు, లీడ్ ఐడీలు, రుణాలు లేదా లీజుకు సంబంధించిన రికార్డులు, ఇతర సంబంధిత వివరాలు ఉన్నట్లు బ్యాంకు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఎస్బీఐ తక్షణ చర్యలకు దిగింది. లీక్ అయిన డేటా ప్రామాణికత, సంపూర్ణతను నిర్ధారించడంతో పాటు, సమాచారం ఎక్కడి నుంచి బయటపడింది, ఎంత మేరకు ప్రభావితమైంది అనే అంశాలను తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు అవసరమని ఎస్బీఐ చెబుతోంది. ఖాతాదారులకు, బ్యాంకుకు ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. ఈ ఘటనపై బ్యాంకు సైబర్ భద్రతా చర్యలను వెంటనే అమలు చేసి, సమస్యను నియంత్రించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అలాగే, స్వతంత్ర CERT-In గుర్తింపు పొందిన సైబర్ భద్రతా సంస్థను నియమించి, ఈ ఆరోపణలకు సంబంధించిన సమాచార లీక్ స్వరూపం, పరిధిపై సమగ్ర పరిశీలన చేపట్టినట్లు తెలిపింది. అయితే ఈ లీక్ ఘటన వల్ల బ్యాంకు ప్రధాన కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు లేదా వ్యాపార కొనసాగింపుపై ప్రస్తుతం ఎలాంటి గణనీయమైన ప్రభావం లేదని ఎస్బీఐ తెలిపింది. బ్యాంకింగ్ సేవలు సాధారణంగానే కొనసాగుతున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించే చర్యలను అమలు చేస్తున్నామని తెలిపింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని బ్యాంకు భరోసా ఇచ్చింది.














Click it and Unblock the Notifications
