రమణ సీజేఐగా సుప్రీం కొలీజియం తొలి నియామక సిఫార్సు -అలహాబాద్ సీజేగా జస్టిస్ యాదవ్‌కు ఎలివేషన్, భారీగా
ఇంతకు ముందు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన జస్టిస్ ఎస్ఏ బోబ్డే తన 14 నెలల పదవీ కాలంలో ఒక్కటంటే ఒక్క నియామకం కూడా చేపట్టకపోవడం, అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టుల్లో భారీగా జడ్జిల కొరత ఏర్పడిన దరిమిలా నియామకాల ప్రక్రియపై ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దృష్టిసారించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసేందుకు గాను కొలీజియం సిఫారసుల కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన మరుసటిరోజే కీలక చర్యలకు పూనుకున్నారు..
జస్టిస్ ఎన్వీ రమణ సహా మరో నలుగురు సీనియర్ జడ్జిలు సభ్యులుగా ఉండే సుప్రీంకోర్టు కొలీజియం గురువారం భేటీ అయింది. జడ్జిల నియామకాలకు సంబంధించి చర్చ జరిపిన కొలీజియం.. అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సంజయ్ యాదవ్ పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్ కు చెందిన జస్టిస్ యాదవ్ ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులోనే ఇంచార్జి సీజేగా విధులు నిర్వహిస్తున్నారు. రమణ సీజేఐ అయ్యాక సుప్రీం కొలీజియం చేసిన తొలి సిఫార్సు ఇదే కావడం గమనార్హం.

ఈ ఏడాది జూన్ 25న రిటైర్మెంట్ కానున్న జస్టిస్ సంజయ్ యాదవ్ ను అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. అలహాబాద్ తోపాటు కోల్ కతా హైకోర్టుకు పూర్తి స్థాయి సీజేను కొలీజియం సిఫార్సు చేయాల్సి ఉంది. అలాగే సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న ఏడు న్యాయమూర్తుల పోస్టులనూ కొలీజియం భర్తీ చేయాల్సి ఉంది.
గడిచిన ఏడాదిన్నర కాలంలో సుప్రీంకోర్టు నుంచి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేలు సీజేఐలుగా రిటైర్ కాగా, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు సైతం పదవీ విరమణ పొందారు. మరో న్యాయమూర్తి ఎం.శంతను గౌడర్ గత నెలలో కరోనాతో కన్నుమూశారు. దీంతో సుప్రీంకోర్టులో 34 జడ్జీలకుగాను ప్రస్తుతం 27 మందే ఉన్నారు. దీంతో జడ్జిల నియామకాలకు సంబంధించి సీజేఐ రమణ ముందు భారీ సవాళ్లు నిలిచాయి.
సుప్రీం జడ్జిలు, హైకోర్టు సీజేలు కాకుండా, దేశంలోని 25 హైకోర్టుల్లో కలిపి 1,080 జడ్జీలకు గాను ప్రస్తుతం 660 మందే ఉన్నారు. పదోన్నతులు, రాజీనామాలు, పదవీ విరమణల కారణంగా జడ్జీల పోస్టుల్లో ఖాళీలు పెరుగుతున్నాయి. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య సహకార లోపం కారణంగా ఖాళీలు పేరుకుపోతున్నాయి. సరిపడా జడ్జిలు లేకపోవడంతో పెండింగ్ కేసులూ పేరుకుపోతున్నాయి. ఈ సమస్యపై తొలి నుంచీ స్పందిస్తూ వస్తోన్న జస్టిస్ రమణ ఇప్పుడు సీజేఐ హోదాలో కొలీజయం ద్వారా నియామకాల మారథాన్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications