ఎన్నికల్లో ఉచితాల పంపిణీ-చేతులెత్తేసిన ఈసీ-అడ్డుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
మన దేశంలో ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఉచితాల పంపిణీ చేపట్టడం సర్వసాధారణమే. అయితే ఈ ఉచితాల పంపిణీకి అడ్డుకట్ట వేయడం ద్వారా ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ దీనీపై ఈసీ సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
ఎన్నికల్లో ఉచితాల్ని పంపిణీ చేయకుండా రాజకీయ పార్టీల్ని అడ్డుకునే విధంగా ఈసీ చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉచితాల పంపిణీకి రాజకీయ పార్టీలు అడ్డుకట్టే వేసేలా తగు చర్యలు సూచించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఆగస్టు 3న ఈ కేసుపై తదుపరి విచారణ నిర్వహిస్తామని, అప్పటికల్లా కేంద్రం తగు సూచనలు చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

ఎన్నికల సమయంలో ఉచితాల్ని ప్రకటించడం, ప్రజాధనంతో వాటిని పంచడం వంటి చర్యల్ని అడ్డుకోవాలని, ఇందులో విఫలమైన రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయడం, ఎన్నికల గుర్తుల్ని రద్దు చేయడం వంటి చర్యల్ని తీసుకునేలా ఈసీని ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్ధానం కచ్చితంగా ఎన్నికల సమయంలో ఉచితాల్ని అడ్డుకోవాల్సిందేనని తెలిపింది. ఈ విషయంలో ఈసీ చేతులెత్తేయడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కాబట్టి కేంద్రం ఇందులో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications