సోఫియా ఖురేషీపై నీచ వ్యాఖ్యల కేసు- బీజేపీ మంత్రికి సుప్రీం డబుల్ షాక్..!
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ముందుండి నడిపించిన ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన నీచమైన వ్యాఖ్యలు దేశాన్ని నివ్వెరపోయేలా చేశాయి. దీనిపై మధ్యప్రదేశ్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో వెనక్కి తగ్గిన మంత్రి తన వ్యాఖ్యలపై సారీ చెబుతున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ఆయన క్షమాపణను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చెప్పిన క్షమాపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వెంటనే విచారణ ప్రారంభించి 9 రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మే 28న బృందం స్టేటస్ రిపోర్ట్ సమర్పించే వరకు ఆయన్ను అరెస్ చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

గత వారం జరిగిన విచారణలో విజయ్ షా వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ వ్యాఖ్యలతో దేశం మొత్తం సిగ్గుపడిందంటూ వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ఇవాళ జరిగిన విచారణలో విజయ్ షా చెప్పిన క్షమాపణలపై స్పందిస్తూ.. కోర్టు చట్టపరమైన చర్యల నుండి బయటపడేందుకు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారా అని మంత్రని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు మధ్యప్రదేశ్ డీజీపీ, ఐజీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.












Click it and Unblock the Notifications