క్రమశిక్షణ!: విద్యార్థులకు గుండ్లు కొట్టించేశారు
బెంగళూరు: ఓ పాఠశాల ఉపాధ్యాయులు క్రమశిక్షణ పేరుతో తమ వద్ద చదువుకుంటున్న 15 మంది విద్యార్థులకు బలవంతంగా గుండ్లు కొట్టించేశారు. అంతేగాక, వారి వెంట్రుకలను బ్యాగులో పెట్టి ఇంటికి పంపించేశారు. ఈ ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లా వీరాజీపేట్ పట్టణంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. వినాయక ఇంగ్లీష్ మీడియం అనే స్కూల్‌లో రెండు-ఏడు తరగతులు చదువుకుంటున్న విద్యార్థులు 15 మందికి గుండ్లు కొట్టించి తల వెంట్రుకల్ని వారి బ్యాగులో పెట్టించి ఇంటికి పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
యాజమాన్యాన్ని ఈ విషయమై వారు కలవాలని ప్రయత్నించగా వారెవరూ అందుబాటులో లేరు. ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడి గదికి సైతం తాళాలు వేసి ఉన్నాయి. ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థుల క్రమశిక్షణలో భాగంగానే వారు ఈ పనిచేశారని చెబుతున్నారు.

కాగా, ఈ విషయమై ఎస్పీ వార్దికా కతియార్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎవరూ ఈ ఘటనపై తమకు ఫిర్యాదు చెయ్యలేదన్నారు. అయినా ఈ విషయంపై తాము వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.
యాజమాన్యం విద్యార్థులకు ఎందుకు గుండ్లు గీయించిందో కారణాలు తెలియ రాలేదన్నారు. పాఠశాల ప్రస్తుతం మూతపడిందని శుక్రవారం తిరిగి తెరుచుకుంటుందని, ఈ ఘటనపై తాము ప్రత్యేకంగా దృష్టి సారించామని బిఈఓ హెచ్‌కె పాండు తెలిపారు.












Click it and Unblock the Notifications