అప్పటి వరకు అప్రమత్తంగా ఉండండి: ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తిపై కేంద్రం అలర్ట్
కరోనా వైరస్ మహమ్మారి తర్వాత అంత సాఫీగా సాగుతున్న సమయంలో దేశంలో ఇన్ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి తర్వాత అంత సాఫీగా సాగుతున్న సమయంలో దేశంలో ఇన్ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇన్ఫ్లూయెంజా ఉపరకమైన H3N2 వైరస్ కారణంగా దేశంలో ఇప్పటికే రెండు మరణాలు సంభవించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మార్చి చివరి నాటికి సీజనల్ ఇన్ఫ్లూయెంజా వ్యాప్తి తగ్గే అవకాశం
సీజనల్ ఇన్ఫ్లూయెంజా(h3n2 influenza) కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కేంద్రం తెలిపింది. మార్చి చివరి నాటికి ఈ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ అంచనా వేస్తోంది. పలు రాష్ట్రాల్లో సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఉపరకమైన హెచ్3ఎన్2 వైరస్ తీవ్రత, మరణాల రేటును పరిశీలిస్తున్నామని పేర్కొంది.

పిల్లలు, వృద్ధుల్లో సీజనల్ ఇన్ఫ్లూయెంజా ప్రభావం
పిల్లలు, ఇతర అనారోగ్యాలతో బాధపడే వృద్ధులు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఈ సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ లు ప్రపంచంలో అన్ని చోట్లా ఉన్నాయని.. కొన్ని నెలల్లో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత వేగంగా ఉంటుందని పేర్కొంది. భారతదేశంలోనూ ఈ వైరస్ వ్యాప్తి రెండుసార్లు కనిపిస్తుందని.. ఇందులో ఒకటి జనవరి-మార్చి మధ్య ఉంటుందని కేంద్ర వైద్యారోగ్య తెలిపింది. ఈ కేసులు మార్చి చివరి నాటికి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తన ప్రకటనలో తెలిపింది.

ఇన్ఫ్లూయెంజాతో మనదేశంలో రెండు మరణాలు: రాష్ట్రాలకు అలర్ట్
కాగా, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ బారిన పడి మనదేశంలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ బారినపడి ఇద్దరు మరణించారు. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
ఇన్‌ఫ్లూయెంజా వచ్చినవారిలో 5-7 రోజులపాటు జ్వరం, దగ్గు లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతానికి ఈ వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సూచించింది. మరోవైపు, ఐసీఎంఆర్ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications