ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు, ట్రాప్‌లో టీఆర్ఎఫ్ కమాండర్
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో మారణ హోమానికి పాల్పడిన ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నాయి భారత భద్రతా బలగాలు. కుల్గాంలోని టంగ్‌మార్క్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పహల్గాం మారణ హోమానికి కారణమైన టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల కమాండర్ ఆసిఫ్ ఫౌజీని భద్రత బలగాలు ట్రాప్ చేశాయి.
ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచ బలగాలు చుట్టుముట్టాయి. కాగా, ఈ దాడుల్లో టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల కమాండర్ అసిఫ్ ఫౌజీ నేరుగా పాల్గొన్నట్లు సమాచారం. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిసింది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భారత సైన్యం మట్టుబెట్టిన కొద్ది గంటలకే టంగ్ మార్క్ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం.

మంగళవారం నాటి పహల్గాం దాడి ఘటనకు పాల్పడింది తామేనంటూ 'రి రిసెస్టెన్స్ ఫ్రంట్' ప్రకటించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, బుధవారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తుండగా.. వారిని సైన్యం మట్టుబెట్టింది. ఎన్‌కౌంటర్ అనంతరం ఉగ్రవాదుల నుంచి భారీ మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, పాకిస్థాన్ కరెన్సీ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఇది ఇలావుండగా, ఉగ్రదాడికి సంబంధించి 1400 మంది అనుమానితులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.
ఉగ్రవాదులకు రాజ్‌నాథ్ వార్నింగ్
పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. దాడికి భారత్ గట్టి బదులిస్తుందన్నారు. ఉగ్రదాడి పిరికిపంద చర్య అని అన్నారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని రాజ్‌నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని.. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారన్నారు. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. దాడికి పాల్పడినవారికి, కుట్ర పన్నివారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాగా, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications