జమ్మూకాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు: ఓ జవాను మృతి, ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జమ్మూకాశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. వరుసగా రెండు ఎన్ కౌంటర్లు జరగడం కలవరం రేపుతోంది. తాజాగా కఠువాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుపెట్టింది. మరోవైపు, కిశ్ట్‌వార్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు సైనికులు గాయ పడ్డారు. ఈ విషయాన్ని సైనిక వర్గాలు వెల్లడించాయి.
మరి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లోనే ఈ ఎన్‌కౌంటర్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కిశ్త్‌వార్‌లోని ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని మొదటగా ఇంటలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీసులతో కలిసి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపట్టింది. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఉగ్ర వాదులు ఉన్న ప్రాంతాన్ని సైనికులు గుర్తించారు.

అనంతరం భద్రతా దళాలు - ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ జవాను అమరుడవగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని సమీపంలోని కమాండ్ సెంటర్‌కు తరలించారు. ఉగ్రవాదుల కోసం భద్రత దళాలు ఇంకా వేట కొనసాగిస్తున్నాయి. జులైలో డోడా జిల్లాలో నలుగురు సైనికులు మరణించిన ఘటనలో ఈ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు సైనిక వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి.
మరోవైపు కఠువా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు భారత సైనికులు. కాగా, మరి కొద్ది రోజుల్లోనే చీనాబ్ లోయలోని కిశ్త్‌వార్, డోడా, రాంబన్ జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలోనే వరుస ఎన్‌కౌంటర్లు జరగడం కలవరానికి గురిచేస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్ అనంత్‌నాగ్, షోపియన్, పుల్వామా, కుల్గాం జిల్లాల్లోని 16 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి.












Click it and Unblock the Notifications