గాంధీ హత్యపై వివాదాస్పద వ్యాఖ్యలు: రాహుల్ గాంధీకి హైకోర్టు సమన్లు
ముంబై: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు జారీ చేసింది. గత సాధారణ ఎన్నికల్లో భాగంగా మహాత్మా గాంధీ హత్య అంశంపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి.
గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని రాహుల్ ఆ సమయంలో విమర్శించడంతో కేసు నమోదైంది. దీనిపై మంగళవారం హైకోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. మార్చి 30న భీవండి కోర్టు ముందు హాజరుకావాలని రాహుల్ గాంధీకి హైకోర్టు సూచించింది.
రాహుల్ గాంధీ ఆరోపణలతో ఆర్ఎస్ఎస్ సభ్యుడు రాజేష్ కుంతే కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గతంలో గైర్హాజరుకు అనుమతించిన కోర్టు ఈ దఫా మాత్రం అందుకు అనుమతించలేదు. కోర్టుకు మార్చి 30న స్వయంగా హాజరుకావాలని రాహుల్ గాంధీకి సూచించింది.

హత్య కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు
డెహ్రాడూన్: ఓ హత్య కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి డిపి యాదవ్ తోపాటు మరో ముగ్గురు నిందితులకు డెహ్రాడూన్‌లోని సిబిఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. 1992లో జరిగిన మాజీ ఎంపి మహేంద్ర సింగ్ భాటి హత్య కేసులో వారికి సిబిఐ ప్రత్యేక జడ్జి అమిత్ కుమార్ సిరోహి ఈ శిక్షను విధించారు.
కాగా, యాదవ్ సోమవారం నాడు పోలీసులకు లొంగిపోవడంతో జుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. సెప్టెంబర్ 13, 1992న దాద్రి రైల్వే క్రాసింగ్ వద్ద ఘజియాబాద్ ఎమ్మెల్యే భాటి, ఆయన సన్నిహితుడు ఉదయ్ ప్రకాష్ ఆర్యలను తుపాకులతో కాల్చి చంపారు.












Click it and Unblock the Notifications