ఎలాన్ మస్క్ కు భారత్ భారీ షాక్- ఎలక్ట్రిక్ కార్లకు పన్ను మినహాయింపుకు కేంద్రం నో
భారత్ లో విద్యుద్ వాహనాలను దిగుమతి చేసేందుకు సిద్ధమైన ఎలాన్ మస్క్ కు కేంద్రం షాకిచ్చింది. భారత్ లో పన్ను లేకుండా విద్యుత్ వాహనాలను ఎగుమతి చేసేందుకు ఎలాన్ మస్క్ సంస్ధ టెస్లా చేసిన ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ ఛైర్మన్ క్లారిటీ ఇచ్చేశారు.
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లాకు కేంద్రం ఆఫర్లు ఇచ్చింది. అలాగే తెలంగాణతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆఫర్లు ఇచ్చాయి. ఇదే అదనుగా టెస్లా భారత్ లో వందశాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరింది. దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్ వివేక్ జోహ్రీ స్పందించారు. ఇప్పటికే విదేశాల నుంచి పాక్షికంగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకునేందుకు, వాటిని ఇక్కడే తక్కువ పన్నులతో తయారు చేసే వెసులుబాటు ఇచ్చినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తద్వారా టెస్లాకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశాల్లేవని తేల్చిచెప్పినట్లయింది.

విద్యుత్ తో పనిచేసే వాహనాల విషయంలో పన్నుల్లో మార్పులు చేసే అవకాశం ఉందని, కానీ ఇప్పటికే స్వదేశీ విద్యుత్ వాహనాల తయారీ ప్రారంభమైన నేపథ్యంలో విదేశీ వాహనాలకు పన్నులు పూర్తిగా మినహాయింపు ఇస్తే ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్రం చెబుతోంది. దీంతో టెస్లాతో పాటు ఇతర విదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పూర్తిగా పన్ను రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో భారీ మార్కెట్ ఉన్న భారత్ విషయంలో ఆయా సంస్ధలు ఏ నిర్ణయం తీసుకోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. దీంతో విదేశీ ఎలక్ట్రిక్ వాహనాల వ్యవహారం మరికొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications