ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టు షాక్-బాంబే హైకోర్టు తీర్పు రద్దు
మావోయిస్టులతో కలిసి దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారన్న ఆరోపణలపై నాగ్ పూర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు 24 గంట్లలోనే భారీ షాక్ తగిలింది. నిన్న ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయాలని బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ రద్దు చేసింది. దీంతో ఆయన నాగ్ పూర్ జైల్లోనే కొనసాగాల్సిన పరిస్ధితి.
మావోయిస్టులతో సంబంధాల ఆరోపణలపై 2014 ఫిబ్రవరిలో జీఎన్ సాయిబాబా అరెస్టయ్యారు. 2017లో స్ధానిక కోర్టు ఆయన్ను దోషిగా కూడా తేల్చి నాగ్ పూర్ జైలుకు పంపింది. అయితే ఆయన దీన్ని బోంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. నిన్న ఆయనతో పాటు పలువురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే సాయిబాబా వెంటనే విడుదల కాలేదు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతే కాదు ఇవాళ కోర్టు సెలవుదినమైనా ప్రత్యేక విచారణ జరపాలని కోరింది. దీనికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది.

ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలంటూ నిన్న బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. తన క్లయింట్ అనారోగ్యంతో 90 శాతం వికలాంగుడిగా మారిపోయారని ఆయన న్యాయవాది వాదించారు. ఆయన్ను కనీసం హౌస్ అరెస్టు చేయాలని కోరారు. అయినా తీవ్ర నేరం నేపథ్యంలో సాయిబాబాను విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. చివరికి బోంబే హైకోర్టు తీర్పు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది.












Click it and Unblock the Notifications