వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ వర్కర్స్: ‘వారిని నేరస్థుల్లా చూడకూడదు, అరెస్టు చేయకూడదు’ - సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సెక్స్ వర్కర్లు

సెక్స్ వర్కర్ల జీవితాన్ని ప్రభావితంచేసే, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించే కీలక ఆదేశాలను సుప్రీం కోర్టు వెల్లడించింది.

తమ ఇష్టంతో పనిచేసే సెక్స్ వర్కర్లపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని, వారి పనుల్లోనూ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు సూచించింది. వారిని నేరస్థుల్లా పరిగణించవద్దని, వారికి సముచిత గౌరవం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.

జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు నేతృత్వంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలు సభ్యులుగాగల ధర్మాసనం మే 19న ఈ ఆదేశాలు ఇచ్చింది. 2011లో కోల్‌కతాలో ఒక సెక్స్‌వర్కర్‌పై నమోదైన ఫిర్యాదుకు సంబంధించిన కేసును సుప్రీం కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ఈ కేసులో దర్బార్ మహిళా సమన్వయ కమిటీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అనంద్ గ్రోవర్ బీబీసీతో మాట్లాడారు. ''సుప్రీం కోర్టు చాలా మంచి ఆదేశాలు ఇచ్చింది. సెక్స్ వర్కర్లకు సంబంధించి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఇదే తొలిసారి’’అని ఆనంద్ చెప్పారు.

''సెక్స్‌ వర్కర్లతోపాటు మొత్తం సమాజానికి ఈ ఆదేశాల ద్వారా సుప్రీం కోర్టు మంచి సందేశం ఇచ్చింది. ఇకపై సెక్స్ వర్కర్లను కూడా గౌరవంతో చూడాలని. వారిని నేరస్థులుగా పరిగణించకూడదని తెలుసుకుంటారు. వారికి ఇప్పటికే చాలాచోట్ల రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లాంటివి ఇస్తున్నారు’’అని ఆనంద్ అన్నారు.

సెక్స్ వర్కర్లు

''ఈ తీర్పు తర్వాత ఏదైనా రైడ్‌లలో సెక్స్ వర్కర్లు పట్టిబడితే, వారు ఇష్టపూర్వకంగానే ఆ పనికి సిద్ధమైతే, పోలీసులు వారిని అరెస్టు చేయడానికి వీల్లేదు’’అని ఆయన వివరించారు.

''వేశ్యాగృహాలపై దాడులకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అక్కడ మహిళలను అరెస్టు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వారు నేరస్థులు కాదు’’అని ఆనంద్ అన్నారు.

''అయితే, ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వారిని నేరస్థులుగా పరిగణించొద్దని మాత్రమే సుప్రీం కోర్టు చెప్పింది. కానీ, వారి పనిని ఇక్కడ వృత్తిగా గుర్తించలేదు’’అని ఆనంద్ వివరించారు.

''సెక్స్ వర్క్‌ను వృత్తిగా గుర్తిస్తున్నట్లు ఆ ఆదేశాల్లో ఎక్కడా పేర్కొనలేదు. కానీ, దేశ వ్యాప్తంగా వారిని గౌరవంతో చూడాలని చెప్పారు’’అని ఆయన పేర్కొన్నారు.

ఇది అందరికీ శుభవార్తలాంటిదని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ కామిని జైస్వాల్ కూడా బీబీసీతో చెప్పారు.

సెక్స్ వర్కర్లు

''వారిని నేరస్థుల్లా పరిగణించకూడదు. ఎందుకంటే వారూ మనుషులే. వారిని గౌరవప్రదంగా చూడాలని చెప్పడం నిజంగా గొప్పవిషయం. వారికి చేయడానికి వేరే పనేమీ దొరక్కపోవడం వల్లే ఈ పని చేస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి’’అని జైస్వాల్ వివరించారు.

''వారు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ పనిచేస్తున్నారు. కనీసం సుప్రీం కోర్టు అయినా వారికి గౌరవం ఇవ్వాలని గుర్తించింది’’అని ఆమె చెప్పారు.

అయితే, తినడానికి తిండి, ఉండటానికి చోటు లాంటి సదుపాయాలను కల్పించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని ఆమె అన్నారు. ''సెక్స్ వర్కర్లకూ ఒక గుర్తింపు నంబరు ఇవ్వాలి. దాని సాయంతో ఆహారం, వసతి లాంటివి ప్రభుత్వం వారికి కల్పించాలి’’అని ఆమె వివరించారు.

''ముఖ్యంగా ఈ విషయంలో పోలీసుల్లో చైతన్యం రావాలి. అన్ని అంశాలపైనా వారికి అవగాహన కల్పించాలి’’అని ఆమె అన్నారు.

''హక్కులు గుర్తించారు’’

సుప్రీం కోర్టు తీర్తుతో సెక్స్ వర్కర్లను హక్కులున్న పౌరులుగా గుర్తించినట్లయిందని సీనియర్ న్యాయ నిపుణురాలు వృందా గ్రోవర్ వ్యాఖ్యానించారు. ''వారినీ గౌరవించాలి. అందరిలానే అన్ని సామాజిక భద్రతా చట్టాలు వారికీ వర్తింపచేయాలి’’అని ఆమె అన్నారు.

''సుప్రీం కోర్టు చాలా మంచి ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల్లో సెక్స్ వర్కర్లపై జరుగుతున్న హింస, వివక్ష గురించి ప్రస్తావించారు. ఇవి కీలకమైన ఉత్తర్వులు. వర్కర్లకు కూడా హక్కులుంటాయని దీని ద్వారా గుర్తించినట్లయింది. వారికి సంబంధించిన చట్టాలను పక్కాగా అమలు చేయాలి’’అని వృందా గోవర్ చెప్పారు.

2011లో ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా పరిగణలోకి తీసుకుంది. దీనిపై ప్రదీప్ ఘోష్ ఛైర్మన్‌గా ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ చేసిన సూచనలు

  • అక్రమ రవాణాకు కళ్లెం వేయాలి
  • సెక్స్ వర్క్ నుంచి బయటకు వచ్చే వారికి పునరావాసం కల్పించాలి
  • సెక్స్ వర్క్‌ను కొనసాగించేవారినీ గౌరవ ప్రదంగా చూడాలి

కమిటీ చేసిన సూచనల్లో చాలావాటికి సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. ముఖ్యంగా సెక్స్ వర్కర్లను పోలీసులు అరెస్టు చేయకూడదనే ప్రధాన సూచనకు కోర్టు అంగీకారం తెలిపింది.

''ముఖ్యంగా సెక్స్ వర్కర్ వయసు 18 ఏళ్లకుపైబడి ఉంటూ, ఇష్టపూర్వకంగానే వారు ఈ పనిచేస్తే ఎలాంటి చర్యలూ తీసుకోకూడదు’’అని జస్టిస్ రావు నేతృత్వంలోని ధర్మాసనం తమ ఆదేశాల్లో పేర్కొంది.

''సెక్స్ వర్కర్లకు కూడా అన్ని చట్టాలూ సమానంగా వర్తించాలి. క్రిమినల్ లా కూడా వారికి సమానం వర్తించాలి. సెక్స్ వర్కర్ వయోజనురాలై.. ఇష్టపూర్వకంగా ఆ పనిచేసినప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదు. అసలు జోక్యం చేసుకోకూడదు’’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

''మరోవైపు సెక్స్ వర్కర్ పిల్లలను కూడా తల్లి నుంచి వేరు చేయకూడదు. వారిని గౌరవపద్రంగా చూడాలి. వారికి, వారి పిల్లలకు అన్నింటా సమానంగా హక్కులు కల్పించాలి’’అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఒకవేళ మైనర్లు వేశ్యావాటికల్లో కనిపిస్తే వారిని బలవంతంగా ఈ పనిలోకి తీసుకొచ్చినట్లే భావించాలని కోర్టు స్పష్టంచేసింది.

''ఒకవేళ ఆమె తన కొడుకు లేదా కుమార్తని సెక్స్ వర్కర్ చెప్పినప్పుడు.. వారికి పరీక్షలు చేయాలి. అంతేకానీ, బలవంతంగా పిల్లలను వారి నుంచి వేరుచేయకూడదు’’అని కోర్టు పేర్కొంది.

తమపై జరిగే నేరాలకు సంబంధించి క్రిమినల్ కేసులను నమోదుచేసే సమయంలోనూ సెక్స్ వర్కర్లపై వివక్ష చూపకూడదని కోర్టు నొక్కిచెప్పింది. ముఖ్యంగా లైంగిక నేరాలపై వారు చేసే ఫిర్యాదులనూ ఇతరుల ఫిర్యాదుల్లానే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది. వారికి ఇతర లైంగిక నేరాల బాధితుల్లానే తగిన వైద్య సాయం అందించాలి.

''సెక్స్ వర్కర్లతో పోలీసులు చాలా కఠినంగా, హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి హక్కులూ లేనివారిని చూసినట్లుగా చూస్తున్నారు. పోలీసుల్లో చైతన్యం రావాల్సిన అవసరముంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది.

''సెక్స్ వర్కర్ల సంరక్షణ, అరెస్టు సమయంలో వారి వివరాలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి పేర్లు, ఫోటోలు మీడియాలో రాకుండా జాగ్రత్త పడాలి’’అని కోర్టు సూచించింది.

ఈ ఆదేశాలపై సీనియర్ పోలీసు అధికారులు మాట్లాడటానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sex workers: 'They should not be seen as criminals, should not be arrested' - What did the Supreme Court say?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X