పాకిస్థాన్ కు భారత్ మాస్టర్ స్ట్రోక్.. ఏప్రిల్ నుంచి ఆ దేశ పరిస్థితి ఏంటో..!
గతేడాది ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించిన విషయం తెలిసిందే. మే 7- 10 వరకు పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అలాగే అటారీ- వాఘా బోర్డర్ మూసివేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ప్రయాణాలు పూర్తిగా నిషేధించింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఈ నిర్ణయాలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది.
అయితే పాకిస్థాన్ మరో షాక్ తగలనుంది. వేసవి నేపథ్యంలో పాకిస్థాన్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని భావించవచ్చు. రావి నదిపై నిర్మిస్తున్న షాపూర్ కండి బ్యారేజ్ మార్చి 31 నాటికి పూర్తి కానుంది. దీంతో ఏప్రిల్ నుంచే పాకిస్థాన్ కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు జమ్మూకాశ్మీర్ మంత్రి జావెద్ అహ్మద్ తాజాగా ప్రకటించారు. 1960 ఒప్పందం ప్రకారం ఈ నదిపై భారత్ కే పూర్తి హక్కులు ఉన్నాయి. కానీ ఇన్నాళ్లూ ప్రాజెక్టులు లేక నీరు వృథాగా పాకిస్థాన్ కు వెళ్లేది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆ నీటితో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లకు సాగునీరు అందనుంది.
ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ జలవనరుల శాఖ మంత్రి జావెద్ అహ్మద్ రాణా మాట్లాడుతూ.. పంజాబ్ సరిహద్దులో ఉన్న ఈ షాపుర్ కండి డ్యామ్ మార్చి 31 నాటికి పూర్తవుతుందని అన్నారు. ఇది పూర్తయిన తర్వాత రావి నది నుండి పాకిస్థాన్ కు వెళ్లే అదనపు నీరు ఆగిపోతుందని తెలిపారు. రావి నది నుండి పాకిస్థాన్ కు వెళ్లే అదనపు నీటిని ఖచ్చితంగా నిలిపివేయాలి అని ఈ మేరకు మంత్రి రాణా పేర్కొన్నారు.
కతువా, సాంబా జిల్లాలు కరవు పీడిత ప్రాంతాలని.. ఈ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇక ఈ షాపుర్ కండి ప్రాజెక్టు పూర్తయితే పంజాబ్‌లో 5,000 హెక్టార్లు, జమ్మూ కాశ్మీర్ లోని కతువా, సాంబా జిల్లాల్లో 32,173 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ ద్వారా పంజాబ్ లో 206 మెగావాట్ల జల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసే వీలుంది.

ఇక జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ ఆ సమయంలో అధికారికంగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications