ఆ వార్తతో అంతా తలకిందులు.. సుప్రియ ఉరుకులు పరుగులు:
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. భార్య సునేత్రా పవార్, కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్ ఉన్నారు. ఆయన ప్రయాణిస్తోన్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనతో పాటు విమానంలో ప్రయాణిస్తోన్న మరో ముగ్గురు కూడా మరణించారు. ఆయన ప్రయాణిస్తోన్న విమానం కొద్దిసేపటి కిందటే మహారాష్ట్రలోని బారామతిలో కుప్పకూలింది.
అజిత్ పవార్‌కు చెందిన ప్రైవేట్ విమానం అది. కొద్దిసేపటి కిందటే బారామతి సమీపంలో కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదం ల్యాండింగ్ సమయంలో సంభవించిందని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అజిత్ పవార్ ఈ తెల్లవారు జామున బారామతికి బయలుదేరారు. బారామతికి సమీపించిన అనంతరం ఇందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పైలెట్ ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది.

ప్రమాదం సంభవించిన వెంటనే విమానం పొలాల్లో పడింది. మంటల్లో చిక్కుకుంది. సంఘటనా స్థలం నుండి వెలువడిన చిత్రాలు భయానకంగా ఉన్నాయి. దట్టమైన పొగతో పాటు విమానం పెద్ద ఎత్తున కాలిపోతున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. పూర్తిగా కాలి బూడిదైన విమానం శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి ఇందులో.
విమానం కూలిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు, అధికారులు, సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ప్రయత్నాల్లో పాలుపంచుకుంటున్నారు. అంబులెన్స్‌లు, ఇతర వైద్య సహాయక బృందాలను కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో ముగ్గురు కన్నుమూశారు.
సమాచారం అందిన వెంటనే సుప్రియా సులే, సునేత్ర పవార్ సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి కిందటే అక్కడికి చేరుకున్నారు. తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు. సంఘటన స్థలంలో ఆమె కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ షాక్ కు గురయ్యారు. విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం కలచివేసిందని, గాడ్ ఫాదర్ ను కోల్పోయానని సుప్రియా సులే చెప్పారు.












Click it and Unblock the Notifications