సంకీర్ణం: చెరో రెండున్నరేళ్లని శివసేన కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నప్పటికీ మెజార్టీకి చాలా దూరంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానాలో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో మాత్రం అధికారం చేపట్టాలంటే ఇతర పార్టీల మద్దతు అవసరం కానుంది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీకి ఎవరు మద్దతిస్తారు? శివసేన ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరికి ఓటేస్తారు? అనే చర్చ సాగుతోంది. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో లేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఫడ్నవీస్ చెబుతున్నప్పటికీ.. ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలున్నాయని అంటున్నారు.

అయితే, ఇప్పటికే బీజేపీ పైన ఆగ్రహంతో ఉన్న శివసేన మద్దతిస్తుందా అనే చర్చ సాగుతోంది. ఒకవేళ మద్దతిచ్చినా ఫడ్నవీస్ అభ్యర్థిత్వానికి అంగీకరించదని చెబుతున్నారు. పంకజ్ ముండే అభ్యర్థిత్వానికి శివసేన మద్దతు తెలుపవచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీకి మద్దతివ్వాలనుకుంటే ఎన్సీపీకి ఆ ఇద్దరు నేతలు ఆమోదమేనని అంటున్నారు.
మోడీపై ఉన్న నమ్మకానికి ఫలితాలు నిదర్శనం: షాన్‌వాజ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఉన్న నమ్మకానికి తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి షాన్ వాజ్ హుస్సేన్ ఆదివారం అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో మోడీ నడిపించగలరన్న విశ్వాసం ప్రజలకు ఉందని మరోసారి తేటతెల్లమైందన్నారు.
నీతి, అభివృద్ధికి ఓటు: జవదేకర్
మహారాష్ట్ర, హర్యానాలో రాష్ట్రాల్లో సామాన్య ప్రజలు నీతి, అభివృద్ధికి ఓటు వేశారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఎవరు మంచి పాలనను అందిస్తారో వారి వైపే ప్రజలు మొగ్గు చూపారన్నారు. మిగతా పార్టీల లెక్కలు అన్ని తారుమారు అయ్యాయని వ్యాఖ్యానించారు.
కొత్త ప్రతిపాదన తెచ్చిన శివసేన
మహారాష్ట్రలో బీజేపీకి పూర్తి ఆధిక్యత వచ్చే అవకాశం లేని నేపథ్యంలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై సేన కొత్త ప్రతిపాదన తీసుకు వచ్చింది. సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకుందామని ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications