ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్.. కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు ..!
భారత ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్సభ ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రసంగాలలో వీరు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టు ఎన్నికల సంఘం నేడు నోటీసులు జారీ చేసింది. దేశంలో స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణపై ఫోకస్ చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని ప్రధాన పార్టీల అధ్యక్షులకు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి నోటీసులు పంపి సమాధానం కోరింది.
బీజేపీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులకు నోటీసులు
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు ఏప్రిల్ 29 సోమవారం ఉదయం 11 గంటల లోపు సమాధానమివ్వాలని పేర్కొంది. ఈ ఉదయం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన రెండు పేజీల ప్రకటనలో రెండు పార్టీలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ లు చేసిన వ్యాఖ్యల పైన ఈసీ వివరణ కోరింది.

పార్టీ అధ్యక్షులను వివరణ కోరిన ఈసీ
బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీల ప్రచారాలు మతం, కులం, సంఘం లేదా భాష ఆధారంగా ద్వేషం మరియు విభజనకు కారణమవుతున్నాయని, విద్వేష ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులు జాగ్రత్త వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి, స్టార్ క్యాంపెయినర్ ల ప్రవర్తనపై పార్టీ తగినవిధంగా సూచనలు ఇవ్వాలని పేర్కొంది.
ప్రధాని మోదీ,ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సమాధానం కోసం నోటీసులు
ఈసిఐ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం అధ్యక్షులను బాధ్యులను చేస్తూ నోటీసులు వెల్లడించింది. ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పైన అటు బిజెపి ఇటు కాంగ్రెస్ పార్టీలు ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ స్పందించి సమాధానం చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications