నిర్మా డిటర్జెంట్ పౌడర్, పామాయిల్‌తో పాలు: 2.3 కోట్ల లీటర్ల నకిలీ పాల గుట్టు రట్టు!
ప్రజలు, చిన్నపిల్లల ప్రాణాలను పణంగా పెడుతూ సాగుతున్న ఓ భారీ నకిలీ పాల కుంభకోణం తాజాగా మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో జరిగిన పాల కల్తీ దందాపై పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఈ అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గత 6 నెలలుగా మార్కెట్లో 2.3 కోట్ల లీటర్ల విషపూరిత కల్తీ పాలు అమ్మినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారి విచారణలో ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దందా సాగిందిలా..
నిందితులను నుంచి స్వాధీనం చేసుకున్న అమ్మకాల రిజిస్టర్లను పరిశీలించగా.. గత 6 నెలల్లో సుమారు 2,30,470 కిలోగ్రాముల నాణ్యత లేని పాలపొడిని కల్తీకి ఉపయోగించినట్లు వెల్లడైంది.ఈ భారీ పరిమాణంలోని పాలపొడిని ఉపయోగించి దాదాపు 23,04,070 లీటర్ల కృత్రిమ పాలను తయారు చేశారు, దీని అంచనా విలువ 9 కోట్ల 21 లక్షల 62 వేల 800 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దర్యాప్తులో వెల్లడైన అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. నిందితులు ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల కృత్రిమ పాలను కలిపేవారు (ఇది 10% కల్తీకి సమానం). ఈ 10% నిష్పత్తి ఆధారంగా భూమ్ ప్రాంతంలోని పాల సేకరణ కేంద్రాల నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 2.3 కోట్ల (23 మిలియన్) లీటర్లకు పైగా కల్తీ పాలు సరఫరా చేయబడ్డాయని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు.

నిర్మా డిటర్జెంట్ పౌడర్, పామాయిల్‌తో పాలు
కృత్రిమ పాలు చిక్కగా కనిపించేలా చేయడానికి, అవసరమైన కొవ్వు(ఫ్యాట్) స్థాయిలను నిర్వహించడానికి నిందితులు దారుణమైన పద్ధతులను వినియోగించారు. ఆ కృత్రిమ పాలలో నిందితులు నిర్మా డిటర్జెంట్ పౌడర్ (నిర్మా), పామాయిల్, అత్యంత నాసిరకం రసాయన పౌడర్‌ను కలిపి ఈ కృత్రిమ పాలను తయారు చేసినట్లు విచారణలో తేలింది. పశుగ్రాసం బిజినెస్ నెపంతో ఈ పాల దందాను గుట్టుచప్పుడు కాకుండా నడిపించినట్లు భూమ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ గణేష్ కనగుడే వెల్లడించారు. డిటర్జెంట్, పామాయిల్ కలిగిన ఈ రసాయనాలతో నిండిన పాలను నిరంతరం తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటాయని.. ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ప్రాణాంతకం కాగలదని వైద్య నిపుణులు హెచ్చరించారు.
పరారీలో నిందితులు
ఈ అత్యంత సున్నితమైన కేసులో, పోలీసులు ఏడుగురిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ.. కేసు నమోదయ్యి ఎనిమిది రోజులైనా నిందితులందరూ పరారీలోనే ఉన్నారు. పరారీలో ఉన్న కల్తీదారులను పట్టుకోవడానికి ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. అనుమానిత రహస్య స్థావరాలపై నిరంతర దాడులు నిర్వహిస్తున్నారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం, ప్రాణాంతకమైన పాల కల్తీకి పాల్పడినట్లు రుజువైన వారికి పది లక్షల రూపాయల వరకు జరిమానా, యావజ్జీవ కారాగార శిక్షతో సహా కఠినమైన శిక్షలు విధించబడతాయి.
Hundreds of litres of milk were reportedly dumped after rumours of an FDA raid spread among unlicensed dairies in Maharashtra.
— Money Purse {మనీ పర్స్ } (@Moneypurseadv) July 13, 2026
If businesses fear inspections more than they trust compliance, it raises serious questions about food safety, regulation, and accountability.
Source :… pic.twitter.com/8TI7NDl1ck
భూమ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీగణేష్ కనగుడే మాట్లాడుతూ.. "దాడుల సమయంలో అధికారులు 61 బస్తాల కల్తీ పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో బాలసాహెబ్ గోడ్గే భూమ్ ప్రాంతంలోని అనేక డెయిరీ యూనిట్లకు కల్తీ పాలు తయారు చేయడానికి ఈ కల్తీ పాలపొడిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ రాకెట్‌లో పలు పాల సేకరణ కేంద్రాల ప్రమేయం ఉన్నట్లు కూడా దర్యాప్తులో తేలింది. అయితే ఈ పొడితో తయారు చేసిన వేలాది లీటర్ల కల్తీ పాలను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఇంకా గుర్తించలేదు లేదా అరెస్టు చేయలేదు. పశువుల మేత అమ్మకం ముసుగులో ఈ రాకెట్ నడుస్తోంది. భూమ్ తాలూకా ప్రతిరోజూ లక్షల లీటర్ల పాలను ఎగుమతి చేస్తుంది. అందువల్ల ఈ కేసు చాలా ముఖ్యమైనది" అని ఇన్‌స్పెక్టర్ శ్రీగణేష్ కనగుడే వెల్లడించారు.












Click it and Unblock the Notifications