ఆ కేసులో కింగ్ పిన్, జైల్లో నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ, రెడ్డి పార్టీతో మంతనాలు ?
బెంగళూరు/కలబురిగి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి రసవత్తరంగా మారిపోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్. జేడీఎస్, కేఆర్ పీ పార్టీతో పాటు ఆప్ టిక్కెట్ ల మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చెయ్యడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నారు. అయితే కర్ణాటకతో పాటు దేశాన్ని కుదిపేసిన సబ్ ఇన్స్ పెక్టర్ల ఉద్యోగాల నియామకం స్కామ్ కింగ్ పిన్ ఇప్పుడు జైలులో ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ప్రయత్నించడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలో సబ్ ఇన్స్ పెక్టర్లు (ఎస్ఐ) ఉద్యోగాల నియామకం కోసం రాతపరీక్షలు జరిగాయి. ఎస్ఐ ఉద్యోగాల నియామకం కోసం జరిగిన పరీక్షల్లో భారీ గోల్ మాల్ జరిగిందని వెలుగు చూడటం అప్పట్లో కలకలం రేపింది. ఇదే కేసులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు టీచర్లు. పోలీసు అధికారులు, ఎస్ఐ పరీక్షలు రాసిన అభ్యర్థులు అరెస్టు అయ్యి జైలుపాలైన విషయం తెలిసిందే.

ఎస్ఐ ఉద్యోగాల నియామకం స్కామ్ కేసు కింగ్ పిన్ రుద్రేగౌడ పాటిల్ తప్పించుకుని తిరుగుతుంటే చివరికి సీఐడీ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు జీవితం గడిపిన రుద్రేగౌడ పాటిల్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలబురిగి జిల్లాలోని అఫజలపుర నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని రుద్రేగౌడ పాటిల్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఇప్పటికే సమాజసేవ పేరుతో, రుద్రేగౌడ పాటిల్ యువసేన పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గత జనవరి నెలలో రుద్రేగౌడ పాటిల్, అతని సోదరుడు మహంతేష్ పాటిల్ తో పాటు అనేక మంది మీద ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈడీ అధికారులు దాడులు చేసిన మూడు రోజుల తరువాత బెయిల్ మీద బయట ఉన్న రుద్రేగౌడ పాటిల్ ను తుమకూరులో మరోసారి అరెస్టు చెయ్యడానికి సీఐడీ అధికారులు ప్రయత్నించారు.

అయితే పోలీసులను పక్కకు తోసేసిన రుద్రేగౌడ పాటిల్ పారిపోయి కొన్ని రోజుల తరువాత కోర్టులో లొంగిపోవడంతో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న రుద్రేగౌడ పాటిల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న రుద్రేగౌడ పాటిల్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వదని తెలిసింది. ఎస్ఐ ఉద్యోగాల స్కామ్ లో బీజేపీ మీద పోరాటం చేస్తున్న కాంగ్రెస్ రుద్రేగౌడ పాటిల్ కు టిక్కెట్ ఇవ్వదని వెలుగు చూసింది.
ఈనెల 10వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి అఫజల్ పుర వెళ్లనున్నారు. ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ పార్టీలో రుద్రేగౌడ పాటిల్ సోదరుడు మహంతేష్, వారి నుచరులు చేరనున్నారు. అయితే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆయన పార్టీ తరపున రుద్రేగౌడ పాటిల్ పోటీ చెయ్యడానికి అంగీకరిస్తారా ?, లేదా ? అనే విషయం వేచి చూడాలి. మొత్తం మీద ఎస్ఐ ఉద్యోగాల నియామకం స్కామ్ కింగ్ పిన్ రుద్రగౌడ పాటిల్ జైల్లో నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ప్రయత్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications