Karnataka: కర్నాటకలో కీలక పరిణామాలు-కేబినెట్లో మార్పులు-సీఎం పదవిపై..!
కర్నాటకలో సీఎం సిద్ధరామయ్యను మార్చాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి కూడా ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల్ని కలవడంతో మొదలైన రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రి కాంగ్రెస్ పెద్దల్ని కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో సీఎంను మార్చాలని వీరు కోరుతున్నారు. దీనిపై అధిష్టానం సీఎం సిద్దరామయ్యకు క్లారిటీ ఇచ్చింది.
రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు తనను మార్చాలంటూ అధిష్టానం పెద్దల్ని కలవడంతో పాటు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ తో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య.. నాయకత్వ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఏది నిర్ణయించినా, ఇద్దరూ వినాలన్నారు. తనతో పాటు డీకే శివకుమార్ కూడా వినాల్సిందేనన్నారు. హైకమాండ్ చెప్పేది అందరూ పాటించాలన్నారు. తాను ఇప్పుడు బడ్జెట్ సమర్పిస్తానని, ఖర్గే బెంగళూరు వస్తున్నారని, ఆయనతో మాట్లాడతానని తెలిపారు. హైకమాండ్ ఇప్పటివరకు ఏదైనా చెప్పిందా అని ఆయన ఎదురు ప్రశ్నించారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని సీఎం సిద్ధరామయ్య తేల్చిచెప్పేసారు. కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని సిద్ధరామయ్య తోసిపుచ్చారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ మాత్రమే జరుగుతుందని సిద్దూ తెలిపారు. రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించవచ్చని చెప్పిన తర్వాతే, ముఖ్యమంత్రిని మార్చే అంశం తెరపైకి వచ్చిందన్నారు. పార్టీ నాయకులు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకోవాలన్నారు. మొత్తం 34 మంత్రి పదవులు ఉన్నాయని, వాటిలో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయని,, వీటిని పునర్వ్యవస్థీకరణలో భర్తీ చేస్తారని సీఎం తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో కేబినెట్ పునర్ వ్యవస్ధీకరణ నేపథ్యంలో సీఎం మార్పును వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకురావడం ద్వారా కేబినెట్లో తన అనుచరుల పదవులు కాపాడుకునేందుకు డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం మార్పు ఉండకపోవచ్చని క్లారిటీ ఇచ్చేసిన హైకమాండ్.. ఇతర విషయాలపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తో చర్చలు జరుపుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని కోరినట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ రణ్ దీప్ సూర్జేవాలా తెలిపారు.












Click it and Unblock the Notifications