• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్ గంగారామ్: భారత్, పాకిస్తాన్ రెండు దేశాల్లోనూ హాస్పిటల్స్ కట్టించిన ఇంజినీర్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సర్ గంగా రామ్

సరిహద్దుకు రెండువైపులా భారత్, పాకిస్తాన్‌లకు తమ వారసత్వ సంపదను అందించిన అతికొద్ది మందిలో సర్ గంగారామ్ ఒకరు. ఇంజినీర్, దాత అయిన సర్ గంగారామ్ పేరిట దిల్లీ, లాహోర్‌లలో నిర్మించిన ఆస్పత్రులు ఎన్నో ఏళ్లుగా, ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నాయి.

ఆయన స్థాపించిన ట్రస్ట్, ఆయన కుటుంబం ఈ ఆస్పత్రులను నిర్మించి, నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాయి.

ఆయన పుట్టింది పాకిస్తాన్‌లోని లాహోర్‌లో. 1947 విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్‌కు వచ్చి దిల్లీలో స్థిరపడింది. 1927లో గంగారామ్ మరణించారు.

రచయిత సాదత్ హసన్ మాంటో రాసిన 'ది గార్లండ్' కథ, గంగారామ్‌కు లాహోర్‌తో ఉన్న అనుబంధం గురించి చెబుతుంది. విభజన సమయంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా మంటో ఈ కథ రాశారని చెబుతారు.

ఈ కథలో, సర్ గంగారామ్ ఆస్పత్రి ముందు ఉన్న ఆయన విగ్రహంపై అల్లరి మూక దాడి చేసి, ఆయన హిందూ పేరును తుడిచిపెట్టాలని చూస్తారు. కానీ, వారిలో ఒక వ్యక్తికి గాయమైనప్పుడు, వారంతా "అతడిని సర్ గంగారామ్ ఆస్పత్రికి తీసుకెళదాం, పదండి" అని అరుస్తారు. ఆయన మిగిల్చిన వారసత్వ సంపద గురించి చెప్పే కథ ఇది.

కఠినమైన క్రమశిక్షణ పాటించే గంగారామ్ చాలా దయగల వ్యక్తిగా కూడా పేరు పొందారు. ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, వ్యవసాయం, మహిళా హక్కులు.. ఇలా పలు రంగాల్లో రంగాలలో ఆయన కృషి చేశారు. వితంతువుల సంక్షేమంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.

సర్ గంగా రామ్

లాహోర్‌ను తీర్చిదిద్దిన గొప్ప ఆర్టిటెక్ట్‌

1940లో బాబా ప్యారే లాల్ బేడీ రాసిన 'హార్వెస్ట్ ఫ్రమ్ ది డెసర్ట్, ది లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ సర్ గంగా రామ్' పుస్తకం నుంచి గంగా రామ్ జీవిత విశేషాలు మనకు తెలుస్తాయి.

గంగా రామ్ 1851లో లాహోర్‌కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగ్తాన్‌వాలా గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి దౌలత్ రామ్ భారతదేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ను విడిచిపెట్టి, అక్కడ జూనియర్ పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌గా చేరారు.

తరువాత, వారి కుటుంబం పంజాబ్ ప్రాంతంలోని అమృత్‌సర్‌కు మారింది. అక్కడే గంగా రామ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు.

ఆయన ఉత్తర భారతదేశంలోను పలుచోట్ల, పాకిస్తాన్‌లోనూ చదువుకున్నారు. లాహోర్‌లో కాలేజీ విద్య అభ్యసించారు. తరువాత, ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీలో ఉన్న థామస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివేందుకు స్కాలర్‌షిప్ పొందారు. ఆయనకు రూ. 50 స్కాలర్‌షిప్‌గా వచ్చేది. అందులో సగం ఆయన అమృతసర్‌లో ఉన్న తన కుటుంబానికి పంపేవారు.

మంచి మార్కులతో ఇంజినీరింగ్ పాస్ అయిన తరువాత, అప్పటి లాహోర్ చీఫ్ ఇంజనీర్ రాయ్ బహదూర్ కన్హయ లాల్ కార్యాలయంలో అప్రెంటిస్‌గా చేరారు. అప్పుడే లాహోర్ ఆర్కిటెక్చర్‌లో "గంగా రామ్ కాలం" ప్రారంభమైంది. ఆయన ఉత్తమ సివిల్ ఇంజినీర్‌గా ఎదిగారు. తన పనితనంతో లాహోర్ నగరంలో ఆర్కిటెక్చర్‌ను తీర్చిదిద్దారు.

లాహోర్ మ్యూజియం, ఐచిసన్ కాలేజీ, మాయో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ (ప్రస్తుతం దీన్ని నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అని పిలుస్తున్నారు), జనరల్ పోస్ట్ ఆఫీస్, మాయో హాస్పిటల్ ఆల్బర్ట్ విక్టర్ వింగ్, గవర్నమెంట్ కాలేజ్ కెమికల్ లేబొరెటరీ వంటి అనేక అద్భుతమైన భవనాల రూపకల్పన, నిర్మాణం గంగారామ్ ఘనతే.

తోరణాలు, ఇతర భారతీయ సంప్రదాయాలను అనుసరించి భవనాల రూపకల్పన చేసేవారని, పంజాబ్‌లోని అధిక వేడి, చలికి తట్టుకునేలా పశ్చిమదేశ నిర్మాణ పరికరాలను ఉపయోగించేవారని బేడీ తన పుస్తకంలో రాశారు.

గంగా రామ్ లాహోర్ నగరంపై చెరగని ముద్ర వేశారు. అందుకే, ప్రఖ్యాత పాకిస్తాన్ జర్నలిస్ట్ ఖాలీద్ అహ్మద్.. గంగా రామ్‌ను "ఆధునిక లాహోర్‌ పితామహుడు" అని అభివర్ణించారు.

సర్ గంగా రామ్

గంగాపూర్ కల

తన విధుల్లో భాగంగా అర్బన్ లాహోర్‌ను తీర్చిదుద్దుతున్న కాలంలోనే, ఆయన మనసు గ్రామీణ పంజాబ్ ప్రాంతాల్లో తిరుగాడేది. ఆయన అక్కడే పుట్టి పెరిగారు.

1903లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తరువాత, ఆయన మళ్లీ తన మూలాలకు చేరుకున్నారు. ఆర్కిటెక్ట్‌గా ఆయన అందించిన సేవలకు ప్రతిఫలంగా చీనాబ్ కాలనీ (తరువాత లియాల్‌పూర్, ఫైసలాబాద్‌గా మారింది)లో ఆయనకు కొంత భూమిని కేటాయించారు.

అక్కడ ఆయన గంగాపూర్ అనే మోడల్ గ్రామాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. వినూత్నమైన నీటిపారుదల, వ్యవసాయ వ్యవస్థలతో ఈ గ్రామాన్ని నిర్మించాలన్నది ఆయన కల.

గంగాపూర్ నుంచి రెండు మైళ్ల దూరంలో ఉన్న బుచియానా రైల్వే స్టేషన్‌కు ప్రత్యేకమైన మార్గాన్ని నిర్మించారు. గుర్రానికి వరుసగా కట్టిన రెండు ట్రాలీలు నడవగల రోడ్డును నిర్మించారు. ఈ ట్రాలీలలో ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు.

గంగాపూర్‌లో తాను ఏర్పాటు చేసిన నీటిపారుదల వ్యవస్థను విస్తరించాలని గంగా రామ్ భావించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని రెనాలా ఖుర్ద్‌లో హైడల్ పవర్ ప్రాజెక్ట్, ఆయన చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి.

1925లో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా, అయిదు టర్బైన్లతో 360 చదరపు కిలోమీటర్ల బంజరు భూములకు నీరు అందించి, వాటిని సారవంతంగా మార్చారు.

సర్ గంగా రామ్

వితంతు హక్కుల కోసం క‌ృషి

గంగా రామ్ రోజూ ఉదయాన్నే నిద్ర లేచి, ఆరోజు తాను చేయాల్సిన పనుల జాబితా చూసుకునేవారని, కొన్నిసార్లు ఉర్దూ కవి మౌలానా అల్తాఫ్ హుస్సేన్ హలీ రాసిన మునాజత్-ఎ-బెవ్గన్ (వితంతువు ప్రార్థన) పద్యాలను చదివేవారని బేడీ రాశారు.

అవి చదువుతూ కన్నీటిపర్యంతమయ్యేవారు. వింతంతువుల కోసం ఆయన చేసిన కృషికి ఈ పద్యాలే స్ఫూర్తి.

1917లో అంబాలా నగరంలో హిందువులు నిర్వహించిన ఒక సదస్సులో వితంతు పునర్వివాహంపై ఒక తీర్మానం తీసుకువచ్చేందుకు గంగా రామ్ ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

అప్పుడే, 'వితంతువుల వివాహ సంఘాన్ని' స్థాపించారు. అందుకోసం తన సొంత డబ్బు రూ. 2,000 లను విరాళంగా ఇచ్చారు.

సమాజంలో వితంతువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ సంఘం అవగాహన కల్పిస్తుంది. అయితే, కొంతమంది వితంతువులకు రెండవ వివాహం చేసుకునే వయసు దాటిపోయిందని, కొంతమంది మళ్లీ పెళ్లి చేసుకోడానికి ఇష్టపడడం లేదని గంగా రామ్ గ్రహించారు.

దాంతో, 1921లో ప్రభుత్వ అనుమతితో హిందూ వితంతువుల గృహాన్ని నిర్మించారు. దానికోసం రూ. 2,50,000 ఖర్చు చేశారు. ఈ గృహంలో వితంతువులకు వివిధ పనులలో శిక్షణ ఇచ్చేవారు. తరువాత, దీనికి అనుబంధంగా రెండు స్కూళ్లు, ఒక హాస్టల్ కూడా నిర్మించారు. వితంతువులు చదువుకుని, పరీక్షలు పాసయ్యేందుకు, చేతివృత్తులు నేర్పించే టీచర్లుగా స్థిరపడేందుకు ఇవి ఎంతో సహాయపడ్డాయి.

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న హిందూ, సిక్కు మహిళల కోసం లేడీ మేనార్డ్ ఇండస్ట్రియల్ స్కూల్ స్థాపనకు కూడా గంగా రామ్ నిధులను సమకూర్చారు.

సర్ గంగా రామ్

సర్ గంగా రామ్ ట్రస్ట్

1923లో సర్ గంగా రామ్ ట్రస్ట్ ఏర్పాటైంది. అదే సంవత్సరం లాహోర్‌లో సర్ గంగా రామ్ ఉచిత ఆస్పత్రిని స్థాపించారు. తరువాత దీన్ని సుసంపన్నమైన శస్త్రచికిత్స, వైద్య విభాగాలతో పూర్తి స్థాయి ఆస్పత్రిగా అభివృద్ధి చేశారని బేడీ రాసిన పుస్తకాలు చెబుతున్నాయి.

పంజాబ్ ప్రాంతలో పురాతన, అతిపెద్ద ఆస్పత్రి 'మాయో హాస్పిటల్' తరువాత ఇదే పెద్ద ఆస్పత్రి.

1924లో హిందూ స్టూడెంట్ కెరీర్ సొసైటీ, సర్ గంగా రామ్ బిజినెస్ బ్యూరో అండ్ లైబ్రరీలను ఈ ట్రస్ట్ స్థాపించింది. హిందూ విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందేందుకు హిందూ స్టూడెంట్ కెరీర్ సొసైటీ సహాయపడేది.

ఆయన బతికున్నప్పుడు చేపట్టిన చివరి ప్రాజెక్ట్, రెండు ఎకరాల స్థలంలో నిర్మించిన హిందూ అపహాజ్ ఆశ్రమం. ఇది వృద్ధులకు, వికలాంగులకు ఆశ్రయం ఇచ్చేది.

1927 జూలైలో లండన్‌లో గంగా రామ్ మరణించారు. ఆయన కోరిక మేరకు ఆయన చితాభస్మంలో కొంత లాహోర్ తీసుకువచ్చి, హిందూ అపహాజ్ ఆశ్రమం పక్కన ఖననం చేశారు. ఇప్పుడు ఆ ఆశ్రమం లేదుగానీ, గంగా రామ్ సమాధి ఇంకా అక్కడే ఉంది.

ప్రఖ్యాత ఉర్దూ రచయిత ఖవాజా హసన్ నిజామీ.. గంగా రామ్ మరణం గురించి ఇలా రాశారు.

"ఎవరైనా తన జీవితాన్ని దానం చేయగలిగితే గంగా రామ్‌కు దానం చేస్తారు. ఎందుకంటే, ఆయన మరికొన్ని సంవత్సరాలు జీవించి భారతదేశంలో కష్టాల్లో ఉన్న మహిళలకు మరిన్ని గొప్ప సేవలను అందించగలరని."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sir Gangaram: An engineer who built hospitals in both India and Pakistan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X