EC కీలక భేటీ- విభేదాలపై క్లారిటీ - SIR, ఓటర్ల ధృవీకరణపై సంచలన నిర్ణయాలు..!
దేశవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR) ప్రక్రియ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఇవాళ సమావేశమైంది. ఇందులో సీఈసీ జ్ఞానేష్ తో పాటు మిగతా ఇద్దరు కమిషనర్లు కూడా పాల్గొన్నారు. అనంతరం ఈ భేటీలో ఓటర్లకు ఊరటనిచ్చేలా తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు వీలుగా నిబంధనలను సడలించినట్లు తెలిపింది. తమ ఓటరు రికార్డుల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ నోటీసులు అందుకున్న ఓటర్లు, ఇకపై విచారణ కోసం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం, బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారికి కావాల్సిన సాయం అందిస్తారు. అవసరమైన పత్రాలను సేకరించి, వాటిని ఈసీఐనెట్ సాంకేతిక పోర్టల్‌లో నేరుగా అప్‌లోడ్ చేస్తారు. అత్యవసరమైన ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ విచారణలు జరుపుతామని, అవి కూడా వీలైనంత వరకు ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది. ఒకవేళ నివాస ధృవీకరణ నిమిత్తం ప్రత్యక్షంగా హాజరు కావాల్సి వస్తే, సదరు ఓటరుకు బదులుగా వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కావచ్చని తెలిపింది. నోటీసులు అందుకున్న సాధారణ ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఢిల్లీ, మహారాష్ట్రలలో దరఖాస్తుల దాఖలు గడువును ఈసీ పొడిగించింది. ఢిల్లీలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అక్టోబర్ 30 వరకు గడువిచ్చింది. పరిష్కార గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది. మహారాష్ట్రలో ఈ గడువును అక్టోబర్ 12 వరకు, పరిష్కార ప్రక్రియను నవంబర్ 10 వరకు పొడిగించింది.

నిరాశ్రయులు, రాత్రి ఆశ్రయాల్లో ఉండే నిరుపేదలు, వలస కూలీల కోసం ప్రత్యేక క్యాంపులు, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఓటర్ల సేవలకు మరియు పత్రాల అప్‌లోడ్‌కు వినియోగిస్తున్న 'ఈసీఐనెట్' పోర్టల్ సమగ్ర పనితీరుపై సమీక్ చేపట్టనుంది. ప్రస్తుత ఎన్నికల చట్టాలు, మౌలిక నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ పోర్టల్ సాంకేతికంగా పనికొస్తుందో లేదో పరిశీలించేందుకు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి తనిఖీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో దేశ ప్రఖ్యాత ఐఐటీ లేదా ట్రిపుల్ ఐటీకి చెందిన స్వతంత్ర సాంకేతిక నిపుణుడిని కూడా భాగస్వామిగా నియమించారు. ఓటర్ల జాబితాలో పేర్లు క్రమబద్ధీకరించుకోని అర్హులైన యువత, తొలిసారి ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి నిరంతర ఓటరు నమోదు ప్రక్రియను ఉపయోగించుకోవచ్చని సూచించింది. చివరగా, కమిషన్ ఏకాభిప్రాయంతోనే ఎస్ఐఆర్ షెడ్యూల్‌ను ఆమోదించిందని, ఈ నిర్ణయాలను గతంలో సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని ఈసీ గుర్తుచేసింది.














Click it and Unblock the Notifications
