మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా
మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తన మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అలాగే గతేడాది మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా చేశారు. ఈ ఇద్దరు మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు.
మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ.. రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపర్చింది. సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. మనీష్ సిసోడియాను ఐపీసీ 120 బి, 477ఎ, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద అరెస్టు చేశారు. ఈ కేసులను బట్టి సిసోడియా ఇప్పుడే బయటపడే పరిస్థితి కనపడటంలేదు. ఈ కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయడం కూడా కష్టమేననే అభిప్రాయాలు వినపడుతున్నాయి. విద్యాశాఖను, ఆరోగ్యశాఖను విజయవంతంగా ముందుకు నడిపించిన ఇద్దరు మంత్రులు అరెస్ట్ కావడం ఆప్ కు తలనొప్పిగా మారింది.

గతేడాది మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో సిసోడియాకు 18శాఖలు కేటాయించగా.. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌కు మూడు శాఖలు ఇచ్చారు. ఇప్పుడు సిసోడియా అరెస్ట్ కావడంతో కేజ్రీవాల్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొద్దిరోజుల్లోనే కర్ణాటక, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అవినీతి ఆరోపణలపై మంత్రులు అరెస్ట్ కావడంతో పార్టీ విస్తరణకు పెద్ద దెబ్బ పడినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సిసోడియా బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో బెయిల్ రావడం కష్టమని భావించిన సిసోడియా రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications