గ్యాంగ్ రేప్ కేసులో తీర్పు: రాజకీయ నాయకులకు జైలు శిక్ష
భువనేశ్వర్: ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మకంతో వెళ్లిన యువతి మీద సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు రాజకీయ నాయకులతో పాటు ఆరుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒడిశాలోని బిజ్జు జనతా దళ్ (BJD) రాష్ట్ర నాయకుడు మహేష్ అగర్వాల్ (ప్రధాన నిందితుడు), ఒడిశా రాష్ట్ర మాజీ మంత్రి బిజయ్ రంజన్ సింగ్ బిరిహ మేనల్లుడు కునాల్ సింగ్ బిరిహ, మరొ రాజకీయ నాయకుడు బిజయ్ సంజన్ అగర్వాల్, పింటు ప్రధాన్, కమలేష్ శ్రీవత్సవ్, గుణనిధి అనే నిందితులకు జైలు శిక్ష పడింది.
ఉద్యోగం ఇప్పిస్తారని వెళితే........!
కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి - ఒడిశాలోని పిక్మల్ గ్రామంలో 24 సంవత్సరాల యువతి నివాసం ఉంటున్నది. ఈమె దళితురాలు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నించింది. 2009 మార్చి 10వ తేదిన ప్రభుత్వ బ్లాక్ కార్యాలయం దగ్గరకు వెళ్లి ప్రభుత్వ ఉద్యోగం గురించి అధికారులను అడుగుతున్నది.
ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాన నిందితుడు మహేష్ అగర్వాల్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. తరువాత యువతిని పిలుచుకుని వెళ్లి గోడౌన్‌లో నిర్బంధించారు. మహేష్ అగర్వాల్‌తో సహా ఆరుగురు ఆమె మీద పదే పదే అత్యాచారం చేశారు.

విషయం బయటకు తెలిస్తే నీ ప్రాణాలు తీస్తామని ఆమెను బెదిరించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు. యువతి మీద సామూహిక అత్యాచారం జరిగిందని వైద్యులు నివేదిక ఇచ్చారు. రాజకీయ నాయకుల ఒత్తిడి చేసినా పోలీసులు వారి పని వారు చేశారు.
బార్గార్ల్ పట్టణంలోని జిల్లా అడిషనల్ సెషన్స్ న్యాయస్థానంలో కేసు విచారణ జరిగింది. బుధవారం జిల్లా జడ్జ్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జాహీర్ అహమ్మద్ నిందితులు నేరం చేశారని, సాక్షాలు ఉన్నాయని అన్నారు. సామూహిక అత్యాచారం చేసిన ఆరుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
తనకు న్యాయం జరిగిందని, ఇక ముందు రాజకీయ పలుకుబడితో ఏమైనా చేస్తాం అనే వారికి ఇది గుణపాఠం అని ఆ బాధితురాలు అంటున్నారు.












Click it and Unblock the Notifications