జైలుకు వెళ్తే పదవి తొలిగించే బిల్లులో బిగ్ ట్విస్ట్, ఆపరేషన్ - 2029..!!
కేంద్రం కీలక నిర్ణయాలకు సిద్దమవుతోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నుంచే సమరం ఆరంభించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ సమావేశాల్లో జమిలి.. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ తో పాటుగా మరో కీలక బిల్లుకు సమాయత్తం అవుతోంది. కీలక పదవుల్లో ఉన్న వారు 30 రోజులకు మించి జైల్లో ఉంటే పదవులు రద్దు పైన బిల్లు తెచ్చే క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాజకీయంగా ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న ప్రతిష్ఠాత్మక బిల్లులను ప్రతిపాదించేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. అందులో భాగంగా 30 రోజులకు మించి జైల్లో ఉంటే వారి పదవులను ఆటోమేటిక్‌గా రద్దు చేసేందుకు కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చింది. కాగా.. ఇక్కడే కీలక అంశం తెర పైకి వచ్చింది. ఈ బిల్లు అధ్యయనం కోసం నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులను చేసింది. తొలుత ప్రతిపాదించిన విధంగా నేతలను పదవుల నుండి పూర్తిగా తొలగించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. దానికి బదులుగా, వారు జైల్లో ఉన్న కాలానికి వారిని పదవుల నుండి కేవలం సస్పెండ్ చేసేలా బిల్లులో మార్పులు చేయాలని సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని జేపీసీ నేతలు అధికారికంగా వెల్లడించారు.

పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులు
కేంద్రం ఈ బిల్లు ప్రతిపాదన సమయంలో కీలక అంశాలను ప్రస్తావించింది. గతంలో కొందరు మంత్రులు, ముఖ్యమంత్రులు జైల్లో ఉంటూనే తమ పదవుల్లో కొనసాగడం వల్ల తలెత్తిన వివాదాలను నివారించేందుకు కేంద్రం ఈ బిల్లును ప్రతిపాదించింది. అయితే, రాజకీయ కక్షసాధింపు చర్యల వల్ల నేతలు తమ పదవులు కోల్పోయే ప్రమాదం ఉండకూడదని జేపీసీ తమ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయిదేళ్లు.. లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ నేరాల్లో అరెస్ట్ అయినప్పుడు మాత్రమే ఈ పదవుల సస్పెన్షన్ నిబంధన వర్తించేలా మార్పులు చేయాలని సిఫారసు చేసింది. ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాకుండానే వారు శాశ్వతంగా పదవులను కోల్పోకుండా చూసేందుకు మరో కీలక సిఫార్సు చేసింది. కోర్టులో వారు నిర్దోషులుగా విడుదలైనా..నిర్దిష్ట గడువులోగా ప్రాసిక్యూషన్ కేసును నిరూపించలేకపోయినా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై ఉన్న సస్పెన్షన్ వెంటనే రద్దు అయ్యేలా.. అదే సమయంలో వారు తిరిగి తమ పదవులను చేపట్టేలా నిబంధన చేర్చాలని జేపీసీ పేర్కొంది. దీంతో.. ఇప్పుడు పార్లమెంట్ లో ఈ బిల్లు పైన చర్చ.. ఆమోదం కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications