ఫ్రంట్ సీటు కోసం తండ్రిని చంపిన కొడుకు.. ఎక్కడంటే ?
ఢిల్లీ తిమార్‌పూర్‌లో ఓ అమానవీయ జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. టెంపో ముందు సీటులో కూర్చోవాలన్న విషయంలో గొడవ తలెత్తి కన్న తండ్నే కడతేర్చాడు ఓ కొడుకు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే... స్థానికంగా నివాసం ఉంటున్న సురేంద్ర సింగ్ (60) కేంద్ర పారామిలిటరీ బలగాల్లో (CISF) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి ఇటీవల పదవీవిరమణ పొందారు. సుదీర్ఘ కాలంగా కుటుంబంతో పాటు కలిసి ఓ ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకొని.. గురువారం ఇంటి సామాన్లను తరలించేందుకు ఒక టెంపోను అద్దెకు తీసుకున్నారు.

అయితే వస్తువులు టెంపోలో ఎక్కించాక.. ముందు సీటులో కూర్చోవాలని కుమారుడు దీపక్ (26) పట్టుబట్టాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో ఆగ్రహించిన దీపక్.. తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో సురేంద్రపై నేరుగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల శబ్దం పక్కనే పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుళ్లకు వినిపించడంతో, వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సురేంద్ర రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికులు దీపక్‌ను అడ్డుకుంటుండగా, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి తుపాకీతో పాటు 12 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
గాయపడిన సురేంద్రను హిందూ రావు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి.. మర్డర్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో దీపక్‌కు మానసిక స్థిరత్వ సమస్యలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, గత కొన్ని నెలలుగా అతడిలో మానసిక ఒత్తిడి, కోపం ఎక్కువగా కనిపించేదని చెబుతున్నారు. కానీ ఇంత తీవ్రమై హత్యకు దారి తీస్తుందన్నది ఊహించలేదని వాపోతున్నారు. క్షణికావేశంలో మానవ సంబంధాలు మంట గలిసిపోతున్నాయి అనడానికి ఈ ఘటన మరో ఉదాహరణ అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications