ఐదుసార్లు ఎమ్మెల్యే.. పార్టీ ఆఫీసులోనే సీనియర్ నేత ఆత్మహత్య
పశ్చిమ్ బెంగాల్ రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ్ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆశిష్ బెనర్జీ(74) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బీర్ భూమ్ జిల్లా రామ్ పూర్ హాట్ లోని తన ఇంటి పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ లోనే ఇవాళ ఉదయం ఉరివేసుకుని వేలాడుతున్న స్థితిలో ఆయన్ను గుర్తించారు.
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశిష్ బెనర్జీ డిప్యూటీ స్పీకర్ గా విధులు నిర్వర్తించారు. అలాగే విద్యా, వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రామ్ పూర్ హాట్ నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ సునామీ ముందు ఓడిపోయారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆశిష్ బెనర్జీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రస్తుతం ఆయన మృతిపై విచారణ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అయితే ఆశిష్ బెనర్జీ సూసైడ్ చేసుకున్న స్థలంలో ఒక పేజీతో కూడిన సూసైడ్ నోట్ లభ్యమైనట్లు సమాచారం అందుతోంది. అందులో.. బెనర్జీ ఇప్పటివరకూ ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. అలాగే ఏ పనికి కూడా డబ్బు వసూలు చేయలేదు. అలాగే అతను పార్టీలో ఎలాంటి తప్పుడు చర్యలను ప్రోత్సహించలేదు.. అని రాసి ఉంది.
ఇటీవల వివాదాస్పదమైన తారాపిట్- రామ్ పూర్ హట్ డెవలప్ మెంట్ అథారిటీకి సంబంధించి టెండర్ కు సంబంధించిన నిర్ణయాలు.. చెక్ ఇష్యూ, ప్లాన్ అనుమతి, ఆమోదం, ఎన్ఓసీ సర్టిఫికెట్ల వివరాలు తదితర అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు వేధించేందుకు ఇలాంటివి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వివరించినట్లు సమాచారం. రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన తప్పు అని ఆశిష్ బెనర్జీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

74 ఏళ్ల ఆశిష్ బెనర్జీ.. 2021 నుంచి 2026 వరకు పశ్చిమ్ బెంగాల్ 13 వ డిప్యూటీ స్పీకర్ గా సేవలు అందించారు. ఆయన రామ్ పూర్ హట్ లో జన్మించారు. బర్ద్ వాన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ పట్టా పొందారు. అలాగే రామ్ పూర్ హట్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి టీఎంసీ నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బెంగాల్ మూజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ఆయన ఆకస్మిక మరణంపై పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications