మన్మోహన్ నుంచి నేర్చుకుంటున్నారు: మోడీపై రాహుల్, పక్షపాతమన్న సోనియా
న్యూఢిల్లీ/రాయ్‌బరేలీ: ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్‌లపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం జరిగిన ఎన్ఎస్‌యూఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాన్ఫరెన్స్ క్రమశిక్షణ పేరుతో అసహనం వ్యక్తమవుతోందని అన్నారు.
ప్రతి ఒక్కరూ చెప్పేది వినడం కాంగ్రెస్ వైఖరని, ఎవరు చెప్పినా వినకపోవడం ఆర్ఎస్ఎస్ వైఖరని చెప్పారు. లైన్ దాటి మాట్లాడితే ఆర్ఎస్ఎస్, బిజెపి తట్టుకోలేదని అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్‌లో వినిపించేది మోడీ వాణినేనని చెప్పారు.
విదేశాల్లో తిరుగుతూ దేశంలోని రైతులను పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ ఏడాది పాలన పూర్తయినా నల్లధనం తెచ్చే సూచనలు కనిపించడం లేదని అన్నారు. మేక్ ఇన్ ఇండియా ఫ్లాపవుతుందని అన్నారు. విద్యకు ఎంతో ప్రాధాన్యమంటూనే బడ్జెట్‌లో కోత పెట్టారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి మోడీ ఆర్థిక పాఠాలు నేర్చుకుంటున్నారని అన్నారు.

పక్షపాతం చూపిస్తున్నారు: మోడీపై సోనియా
తన నియోజవర్గం రాయ్‌బరేలీ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం తమ నియోజకవర్గంపై కావాలనే పక్షపాతం చూపిస్తోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలే ఆమె తనయుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విషయం తెలిసిందే.
ఒక రోజు పర్యటనలో భాగంగా గురువారం రాయ్‌బరేలీ వచ్చిన ఆమె నేరుగా కేంద్రంపై ఎలాంటి విమర్శ చేయలేదు. అయితే, ఈ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి మనోజ్ కుమార్ పాండే మాత్రం ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు.
ఆ తీర్మానాన్ని స్వయంగా సోనియాగాంధీ చదవి వినిపించారు. గతంలో రోడ్డు నిర్మాణాలకోసం ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన ద్వారా గుర్తించిన పనులకు తక్కువ బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కావాలనే ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అందులో ఆరోపించారు. అకాల వర్షం కారణంగా పంట నష్టం చవి చూసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.197 కోట్లు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ.22 కోట్లే కేటాయించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు ఆమె తలా రెండు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.












Click it and Unblock the Notifications