ప్రియాంక విషయంపై సైలెంట్ ... రాహుల్ ఎక్కడకెళ్లారో వచ్చాకే తెలుస్తుంది: సోనియా
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా చేరనున్నారని వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరాకరించారు. సోమవారం ఉదయం పార్లమెంట్‌కు వచ్చిన సోనియాను మీడియా చుట్టుముట్టి అడిగిన ప్రశ్నలపై ఆమె స్పందించారు.
ప్రియాంక విషయంలో తానేమీ వ్యాఖ్యానించనని తెలిపిన ఆమె, రాహుల్ గాంధీ సెలవుపై మాట్లాడుతూ "రాహుల్ ఎక్కడకు వెళ్లారో ఆయన వచ్చిన తర్వాతే మీకు తెలుస్తుంది" అనేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు సెలవు తీసుకుని రాహుల్ గాంధీ యూరప్‌లో విపాసన యోగా చేసేందుకు వెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ఆదివారం వెల్లడించారు.

అయితే పార్టీలో ప్రియాంక ఎలాంటి పదవులనూ పొందదని ఆమె కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో పాటు, ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మా కాశ్మీర్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో కాంగ్రెస్ శ్రేణులు ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరుతున్న విషయం తెలిసిందే.
ఏకే ఆంటోనీ మాట్లాడుతూ "బలమైన, మరింత శక్తివంతంగా" రాహుల్ గాంధీ తిరిగి వస్తారని తెలిపారు. గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకోకుండా పార్టీ అభ్యున్నతికి ఎంతగానో శ్రమపడ్డారు. అందుకే బ్రేక్ తీసుకున్నారని చెప్పారు. రాహుల్, సోనియాలు తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని తెలిపారు.
రాహుల్ పార్లమెంట్ కు గైర్హాజరు పై కాంగ్రెస్ పార్టీ వివరణ:
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ కు గైర్హాజరు పై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ సోమవారం వివరణ ఇచ్చింది. పార్లమెంటులో రాహుల్ కు ఇప్పటివరకు 65 శాతం హాజరు ఉందని పేర్కొంది. రాహుల్ గాంధీతో పోలిస్తే 120మంది ఎంపీల హాజరు ఇంకా ఘోరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
లోకసభకు 5శాతం కంటే తక్కువగా దీపక్ అధికారి, శిబు సోరెన్, సన్వర్ లాల్ హాజరైనట్టు తెలిపాయి. అలాగే రాజ్యసభకు 5శాతం కంటే తక్కువగా సచిన్ టెండూల్కర్, రేఖ, రామస్వామిలు హాజరైనట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.












Click it and Unblock the Notifications