భారత్ పేరు మారడం ఖాయం -దేశానికి మోదీ తన పేరే పెట్టుకుంటాడు -ప్రధానిపై బెంగాల్ సీఎం మమత ఫైర్
మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా, ప్రధాని నరేంద్ర మోదీ మొదలు బీజేపీ పెద్దల ఫోకస్ మొత్తం వెస్ట్ బెంగాల్ పైనే నిలపడంతో అక్కడ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఆదివారం కోల్ కతాలో భారీ బహిరంగ సభ నిర్వహించిన ప్రధాని మోదీ.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు కురిపించగా, వాటికి దీదీ సోమవారం కౌంటరిచ్చారు. మోదీని మించిన స్వరంతో ఆయనను టార్గెట్ చేశారు..
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ ప్రాంగణమైన (అహ్మదాబాద్) మోతేరా స్టేడియానికి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పేరును తొలగించి ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడం, కోవిడ్ వ్యాక్సీన్ ధ్రువపత్రాలపైనా మోదీ ఫోటోనే ఉండటాన్ని ప్రస్తావిస్తూ మమత అనూహ్య వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి కూడా మోదీ పేరు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదంటూ ఎద్దేవా చేశారు.

''మోదీ తన పేరును అంతటా వ్యాప్తి చేస్తున్నారు. అన్నింటికీ తన పేరు పెట్టుకుంటున్నారు. కోవిడ్ వ్యాక్సీన్‌లపై ఆయన ఫొటోలు ముద్రించారు. ఇప్పుడది కోవిడ్ వ్యాక్సీన్ కాదు, మోదీ వ్యాక్సీన్. అంతే కాదు, చాలా కాలేజీలు ఇప్పటికే మోదీ పేరుతో నడుస్తున్నాయి. తాజాగా స్టేడియాలకు కూడా తన పేరు పెట్టుకున్నారు. చూస్తూ ఉండండి.. ఈ దేశం పేరును కూడా మార్చేసి మోదీ తన పేరు పెట్టుకుంటారు'' అని మమతా బెనర్జీ అన్నారు. అంతేకాదు,
బెంగాల్ లో టీఎంసీ సర్కారుపై ప్రధాని అసత్య ప్రచారాలు చేస్తున్నాడని మమత మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్‌కతా సిటీలో పార్టీ శ్రేణులతో కలిసి ఆమె పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మాత్రమే బీజేపీ బడా నేతలకు బెంగాల్ గుర్తుకొస్తుందని విమర్శించారు.

బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదని ఆరోపిస్తోన్న మోదీ.. ఒక్కసారి సొంత ఇలాకా గుజరాత్ తోపాటు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల పరిస్థిని చూసుకోవాలని మమత కౌంటరిచ్చారు. ''మోదీకి ఇష్టమైన గుజరాత్‌లో మహిళల పరిస్థితి ఏంటీ? అక్కడ కనీసం ఆడవాళ్లు రాత్రిపూట స్వేచ్ఛగా బయటకు వెళ్లలేరు. ఆదర్శరాష్ట్రంగా చెబుతున్న గుజరాత్‌లో గత రెండేళ్లుగా రోజుకు నాలుగు అత్యాచారాలు, రెండు హత్యలు జరుగుతున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముందు ఆ రాష్ట్రాలపై దృష్టిపెడితే బాగుంటుంది''అని దీదీ దుయ్యబట్టారు. మొత్తం 294 అసెంబ్లీ సీట్లున్న బెంగాల్ లో ఈనెల 27 నుంచి ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications