mayawati sp bsp union minister Lok sabha rajya sabha union cabinet reservation centre lok sabha polls lok sabha elections 2019 narendra modi parliament constitution కేంద్రం లోకసభ ఎన్నికలు 2019 మాయావతి
అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు, బీజేపీకి మాయావతి రిలీఫ్, అదే దారిలో ఎస్పీ

లక్నో: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లను బీఎస్పీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మంగళవారం నాడు స్వాగతించారు. తమ పార్టీ దీనిని స్వాగతిస్తుందని చెప్పారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ స్టంట్ అని విమర్శించారు.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు మంచి నిర్ణయమేనని, కానీ ఎన్నికల ముందు తీసుకోవడాన్ని తాము ప్రశ్నిస్తున్నామని మాయావతి అన్నారు. లోకసభ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ (భారతీయ జనతా పార్టీ) ఉద్దేశ్యం ఏమిటో అర్థమవుతోందని చెప్పారు.

ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం తప్పు
లోకసభ ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకోవడాన్ని తాము తప్పు పడుతున్నామని మాయావతి చెప్పారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ ఇదివరకే తీసుకోవాల్సిందని ఆమె చెప్పారు. బీజేపీ పాలన ముగిసే సాయంలో, నాలుగున్నరేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే పార్లమెంటులో తాము ఈ బిల్లుకు మద్దతు తెలుపుతామని చెప్పారు.

బీజేపీకి ఊరట
పార్లమెంటులో జరిగే రాజ్యాంగ సవరణకు తాము మద్దతు పలుకుతామని మాయావతి చెప్పారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆమె చెప్పారు. వెనుకబడిన ముస్లీం, ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమాజ్‌వాది పార్టీ కూడా స్వాగతించింది. కాగా, పార్లమెంటులో మద్దతిస్తామని ఎస్పీ, బీఎస్పీలు మద్దతివ్వడం ఎన్డీయే ప్రభుత్వానికి, బీజేపీకి పెద్ద ఊరట.

పార్లమెంటులో బిల్లు
కాగా, అగ్రవర్ణ పేదలకు ఆర్థికస్థోమత ప్రాతిపదికగా విద్య, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం లోకసభలో బిల్లును ప్రవేశ పెట్టింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సాధారణ విభాగంలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను సవరణలు చేయాలి. సుప్రీం కోర్టు విధించిన 50% గరిష్ఠ పరిమితికి అదనంగా ఈ కోటా ప్రతిపాదిస్తున్నందువల్ల దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.