నితీష్ షాకుల వేళ కాంగ్రెస్ కు ఊరట- యూపీలో 11 సీట్లు ఇచ్చిన అఖిలేష్..!
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఇండియా కూటమి పార్టీలు పరస్పరం అపనమ్మకంతో తమ ఐక్యతను దెబ్బతీసుకుంటున్నాయి. ఇప్పటికే బెంగాల్, పంజాబ్ లో ఇండియా కూటమి పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఒంటరిపోరుకు సిద్ధమైపోయాయి. కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తూ లేదని ప్రకటించాయి. అదే సమయంలో బీహార్ లోనూ కాంగ్రెస్ తో సీట్ల పంపకాలు కుదరకపోవడం, ఇతరత్రా సమస్యలతో కూటమిని వీడి సీఎం నితీశ్ కుమార్ తిరిగి ఎన్డీయేకు వెళ్లిపోతున్నారు.
ఇలాంటి సమయలో యూపీలో మాత్రం ఇండియా కూటమికి శుభవార్త చెప్పారు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. యూపీలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమిపక్షాలతో కలిసి పోటీకి సిద్దమవుతున్న అఖిలేష్.. కాంగ్రెస్ పార్టీకి 11 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని ఇవాళ ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ఏకంగా 20 ఎంపీ సీట్లు కోరుతుండగా.. ముందుగా గెలిచే 11 సీట్లలో కాంగ్రెస్ కు అవకాశం ఇస్తామని ఇవాళ అఖిలేష్ ప్రకటించారు.

యూపీలో బీజేపీని ఎదుర్కొని ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు సాధించాలని పట్టుదలగా ఉన్న అఖిలేష్.. మిత్రపక్షం కాంగ్రెస్ తో సీట్ల పంపకాలను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా 11 ఎంపీ సీట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. గెలుపే టార్గెట్ గా అన్ని సీట్లపై చర్చలు జరుపుతున్నట్లు అఖిలేష్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి గొప్ప ఊరట లభించినట్లయింది. గతంలో ఒంటరి పోరుతో పలుమార్లు యూపీలో నష్టపోయిన కాంగ్రెస్.. ఈసారి ఎస్పీతో పొత్తు వల్ల కొన్ని సీట్లు గెల్చుకుని ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications