ప్రత్యేక హోదాపై కేంద్రం విస్పష్ట ప్రకటన: తేల్చుకోవాల్సింది చంద్రబాబే
Special Status for Andhra Pradesh and Bihar: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించడంపై కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. నిండు లోక్‌సభలో తన వైఖరి ఏమిటనేది తేల్చి చెప్పింది. లిఖితపూరక సమాధానం ఇచ్చింది.
ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భాగస్వామ్య పక్షాలుగా ఉంటూ వస్తోన్న తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్)లకు నిరాశకు గురి చేసే ప్రకటన అది. సొంత లాభాలను పక్కనపెట్టి, నిఖార్సుగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఎన్డీఏలో కొనసాగాలా? వద్దా? అనే విషయంపై తేల్చుకోవాల్సిన ఆగత్యం ఈ రెండు పార్టీలకూ ఏర్పడినట్టే.

బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంపై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఝంఝార్‌పూర్‌కు చెందిన జేడీయూ సభ్యుడు రామ్‌ప్రీత్ మండల్.. ఈ అంశాన్ని లేవనెత్తారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటరీ పార్టీ తీర్మానించిందని, ఈ అంశం కేంద్రం దృష్టికి వచ్చిందా? వస్తే.. దీన్ని నెరవేర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ లిఖితపూరక ప్రశ్నను సంధించారు.
దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. లిఖితపూరక సమాధానం ఇచ్చారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు గతంలో ప్రత్యేక హోదాను పొందాయని వివరించారు. వాటికి నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ద్వారా వాటికి ప్రత్యేక నిధులు మంజూరు అవుతాయని తెలిపారు.
ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదాను కల్పించాలంటే కొన్ని ప్రామాణికతలు ఉన్నాయని, వాటికి అనుగుణంగానే తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని పంకజ్ చౌదరి అన్నారు. అలాంటి రాష్ట్రాలను ప్రత్యేకంగా పరిగణించి.. అవి అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా కేంద్రం ప్రత్యేక హోదాను ప్రకటిస్తుందని చెప్పారు.
పర్వత ప్రాంతాలతో కూడుకుని ఉన్నవి, జనసాంద్రత లేదా గిరిజనుల జనాభా అధికంగా ఉండటం, పొరుగు దేశాలతో వ్యూహాత్మక సరిహద్దులను పంచుకుని ఉండటం, ఆర్థిక, మౌలిక సదుపాయాల రంగంలో అత్యంత వెనుకబడి ఉండటం.. వంటి రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదాను కల్పించేలా మార్గదర్శకాలు ఉన్నాయని పంకజ్ చౌదరి వివరించారు.
బిహార్‌కు ప్రత్యేక హోదాను కల్పించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2012 మార్చి 30వ తేదీన ఓ నివేదిక అప్పటి ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్‌కు అందిందని పంకజ్ చౌదరి గుర్తు చేశారు. నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ నివేదికపై చర్చించామని పేర్కొన్నారు. బిహార్ విషయంలో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని తేల్చి చెప్పారు.
ఇదే నిర్ణయం ఏపీకి వర్తిస్తుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే- ప్రత్యేక హోదాను సాధించడానికి ఇంతకంటే అనువైన పరిస్థితులు భవిష్యత్తులో రాకపోవచ్చు. ఎందుకంటే - కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం తెలుగుదేశం, జేడీయూలు మాత్రమే ఊపిరి ఊదుతున్నాయి.












Click it and Unblock the Notifications