సాయంకాదు: మోడీ ప్యాకేజీపై నితీష్, రాహుల్ కూడా
పాట్నా: బీహార్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రూ.1.65 లక్షల ప్యాకేజీ ప్రకటించడంపై ముఖ్యమంత్రి, జెడియూ నేత నితీష్ కుమార్ మంగళవారం కౌంటర్ ఇచ్చారు. అది మాకు భిక్ష కాదని, అది మా హక్కు అని అన్నారు.
నితీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రత్యేక ప్యాకేజీ తమ హక్కు మాత్రమేనని చెప్పారు. అది సహాయం కాదన్నారు. అంత ఆర్భాటంగా ప్రకటించిన ఆ ప్యాకేజీ వివరాలు ఏమిటో చూద్దాం అంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం కోసం, ఎవరి దగ్గరికైనా వెళ్లి ప్రాధేయపడాలన్నా అందుకు తాను సిద్ధమని చెప్పారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు.

కాగా, మంగళవారం నాడు ప్రధాని మోడీ బీహార్‌కు రూ.1.25 లక్షల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. దాంతో పాటు రూ.40 వేల కోట్లు ప్రాజెక్టులకు ఇస్తామని చెప్పారు.
త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. అందులో భాగంగానే మోడీ ప్రకటన చేశారని చెబుతున్నారు. బీహార్‌లో కాంగ్రెస్ - జెడీయూ - ఆర్జేడీలు కలిసి పోటీ చేస్తున్నాయి. బిజెపి - మాంఝీ పార్టీ కలుస్తున్నాయి. ఎన్సీపీ ఒంటరిగా బరిలోకి దిగనుంది.
రాహుల్ గాంధీ మండిపాటు
బీహార్‌కు ప్యాకేజీ పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఎన్నికల సమయంలో ఈ ప్యాకేజీ ప్రకటించడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో సులువుగానే అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రధాని మోడీ మాటలు నమ్మొద్దన్నారు. ఇంతకుముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేయడం మోడీకి తెలియదన్నారు.












Click it and Unblock the Notifications