మోడీజీ ప్రత్యేక హోదా ఇవ్వండి: సీఎం జగన్ వినతులు, తెలంగాణ నుంచి రూ. 6వేల కోట్లు
అమరావతి: విభజన వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రీసోర్స్ గ్యాప్ గ్రాంట్ కింద రూ.34,125 కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరారు. ఈమేరకు ప్రధానికి వినతిపత్రం అందజేశారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మోడీకి జగన్ వినతి
విజయవాడ విమానాశ్రయంలో వీడ్కోలు సమయంలో ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ వినతిపత్రం అందజేశారు. విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేశారు. రీసోర్స్ గ్యాప్ గ్రాంట్ అంశాన్ని ప్రస్తావించిన జగన్.. దానికింద రూ.34,125 కోట్లు ఇవ్వాలని కోరారు.

తెలంగాణ నుంచి రావాల్సిన రూ. వేల కోట్లు ఇవ్వండి
తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలి. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపండి అని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతు బద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. దీన్ని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలి. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు మంజూరుచేయాలి. ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని ప్రధాని మోడీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి 125వ జయంతి వేడుకలను ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు 30 అడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాంతంత్య్ర సమరయోధుల కలల దేశంగా నవభారత్ ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. అందరికీ సమాన అవకాశాలు ఉన్న భారతదేశ నిర్మాణానికి అంతా ఒక్కటై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నవభారత నిర్మాణంలో కీలక భూమిక పోషించేందుకు యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఈ రాజ్యం మనదంటూ అల్లూరి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని కొనియాడారు.












Click it and Unblock the Notifications