TTD: శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి గరుడసేవ, శేష వాహనంపై కపిలేశ్వరుడు
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల అనుబంధ సంస్థ అయిన శ్రీనివాసమంగాపురంలో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో శ్రీవెంకటేశ్వర స్వామి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారులవాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వాహనసేవలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, టీటీడీ అధికారులు, శ్రీవారి సేవకలు పాల్గొన్నారు.

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి శ్రీ కపిలేశ్వరస్వామి వారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు, ఆ ఆదిశేషునిపై భూమండలం. ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం, నిరంతరం దీపకైంకర్యాన్ని అందుకుంటోంది. తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహోత్పవాలను తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.












Click it and Unblock the Notifications