శ్రీరంగపట్నం జామియామసీదు వివాదం: మసీదులో చాలీసా పారాయణ యత్నం; భారీగా పోలీసుల పహారా!!
జ్ఞాన్‌వాపి మసీదు ఘటన రేపిన దుమారం నేటికి దేశ వ్యాప్తంగా అనేక చోట్ల కొనసాగుతోంది. కర్ణాటకలోని శ్రీరంగ పట్నం వద్ద జామియా మసీదు విషయంలో కూడా ఇటువంటి వివాదం కొనసాగుతోంది. తాజాగా కర్ణాటకలోని మాండ్యా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు బెంగళూరుకు 125 కిలోమీటర్ల దూరంలోని శ్రీరంగపట్నం కోట పట్టణాన్ని ముట్టడించారు. జామియా మసీదు పశ్చిమ ద్వారం సమీపంలో ఉన్న మూల ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసేందుకు వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

జామియా మసీదుపై వివాదం
18వ శతాబ్దంలో ఆ ప్రదేశంలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని ధ్వంసం చేసి జామియా మసీదును నిర్మించారని నిరసనకారులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ అశ్వతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించడంతో కార్యకర్తలు మసీదు వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. జామియా మసీదుకు పోలీసులు భద్రతను పెంచారు. మసీదుకు వెళ్లే అన్ని రహదారులకు బారికేడ్లు వేశారు.

ఛలో శ్రీరంగపట్నం కు పిలుపునిచ్చిన భజరంగ్ దళ్ , వీహెచ్పీ
బజరంగ్ దళ్ ఛలో శ్రీరంగ పట్నంకు పిలుపునిచ్చింది . ఈ క్రమంలో ఆందోళనకారులు రద్దీగా ఉండే బెంగళూరు-మైసూరు మరియు మైసూరు-పాండవపుర హైవేలను అడ్డుకున్నారు. మసీదు వైపు వెళ్లడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఎవరైనా చారిత్రక పట్టణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే అరెస్టు చేస్తామని మాండ్య పోలీసు సూపరింటెండెంట్ పి యతీష్ నిరసనకారులను హెచ్చరించారు. తరువాత, ఆందోళనకారులను సమీపంలోని పట్టణమైన కిరంగూర్‌కు తరలించి, హైవేలపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

మసీదులో చాలీసా పారాయణ యత్నం ... అడ్డుకున్న పోలీసులు
అయితే ఇద్దరు ఆందోళనకారులు మసీదు లోపల హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లుగా బజరంగదళ్ కార్యకర్తలు చెబుతున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదని పోలీసులు అంటున్నారు.విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆందోళనల మధ్య కూడా ముస్లిం మతపెద్దలు మసీదు ఆవరణలో ఉన్న మదర్సాలో విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. దీనిని వ్యతిరేకిస్తూ, హిందూ కార్యకర్తలు జిల్లా యంత్రాంగం మరియు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మసీదులో మదర్సాను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని ఆరోపించారు.

మసీదులో హనుమాన్ ఆలయం ఆధారాలని ధ్వంసం చేస్తున్నారని ఆరోపణలు
మదర్సాలోని వారు, హనుమాన్ ఆలయానికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసేందుకు రాళ్లపై ఉన్న ఆకృతులను వికృతంగా మార్చారని వీహెచ్‌పీ మండ్య జిల్లా కార్యదర్శి సునీల్ కుమార్ ఆరోపించారు. జ్ఞాన్‌వాపి మసీదులో చేసినట్లు హనుమాన్ ఆలయాన్ని వీడియో తీయాలని, 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని, వక్ఫ్ ఆస్తుల్లో జామియా మసీదును చేర్చారా లేదా అనే విషయంపై వివరణ కోరినట్లు అసిస్టెంట్ కమిషనర్ శివానంద మూర్తి తెలిపారు.












Click it and Unblock the Notifications