ఏకాభిప్రాయంతోనే అధికారుల విభజన: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల విభజనను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చెప్పారు. గురువారం ఉదయం రాజ్యసభలో ఉద్యోగుల విభజనపై జరిగిన స్వల్పకాలిక చర్చకు సమాధానమిస్తూ ఆయన ఆ విషయం చెప్పారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రత్యూష్ కమిటీ నివేదిక సిద్ధంగా ఉందని, ప్రస్తుతం అఖిలభారత సర్వీసులకు చెందిన అధికారుల విభజన జరుగుతోందని ఆయన చెప్పారు.
విభజనపై కమల్‌నాథన్ కమిటీ సమావేశం నిన్ననే జరిగిందని, కమిటీ సిఫార్సుల ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాడానికి ఇంకా ఏడు, ఎనిమిది నెలల సమయం పడుతుందని, అయితే అంత కన్నా ముందే ఉద్యోగుల పంపిణీ పూర్తి చేస్తామని, ఇరు ప్రాంతాల మనోభావాలను గౌరవిస్తామని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే సీనియర్ అధికారులను విభజిస్తామని ఆయన తెలిపారు.

అంతకు ముందు ఉద్యోగుల విభజనపై చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం మాట్లాడుతూ - ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎప్పటిలోగా విభజిస్తారని ప్రశ్నించారు. ప్రత్యూష్‌సిన్హా కమిటీ విధివిధానాలను స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల సీఎంలను పిలిచి కేంద్రం మాట్లాడాలని ఆయన సూచించారు. నివేదికలు వచ్చేదాకా ఆగకుండా ముందే ఉద్యోగుల విభజన జరగాలని అన్నారు.
18ఎఫ్ తెలంగాణ ఉద్యోగులకు విరుద్ధమని తెలంగాణ సభ్యుడు కె. కేశవరావు ధ్వజమెత్తారు. 18ఎఫ్‌పై తిరిగి పరిశీలించే వరకు పనిచేయబోమని టీఎన్జీవోలు తేల్చిచెప్పారని ఆయన తెలిపారు. ఇప్పటికిప్పుడు తాము దీన్ని అమలు చేయాలని కోరడం లేదని, రెండు వర్గాల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం వల్ల పాలనకు ఆటంకం కలుగుతోందని ఆయన అన్నారు. ఉద్యోగుల విభజన ఎప్పుడు పూర్తవుతుందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications