ప్రణబ్ ముఖర్జీ, రాజ్ నాథ్ సింగ్ తో స్టాలిన్ భేటీ, శశికళకు చెక్ పెట్టి !
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న అన్నాడీఎంకే చీఫ్, జయలలిత నెచ్చెలి శశికళను అడ్డుకోవడానికి ప్రత్యర్థి డీఎంకే పార్టీ గట్టిగా ప్రయత్నిస్తున్నది. ప్రత్యర్థి డీఎంకే పార్టీ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురుకావడంతో శశికళ వర్గీయులు హడలిపోతున్నారు.
తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కరుణానిధి కుమారుడు ఎంకే. స్టాలిన్ మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ప్రజాస్వామ్యాన్నితుంగలో తొక్కి అన్నాడీఎంకే కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చెయ్యనున్నారు.
శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ప్రణబ్ ముఖర్జీ, రాజ్ నాథ్ సింగ్ కు వినతి పత్రం సమర్పించనున్నారు. అదే విధంగా బుధవారం స్టాలిన్, డీఎంకే పార్టీ సీనియర్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. తమిళనాడు పరిణామాలపై మీరు జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరనున్నారు.

శశికళ తమిళనాడు సీఎంగా అవ్వడాన్ని తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామనే దానిపై పార్టీ అభిప్రాయంతో పాటు తన అభిప్రాయం కూడా ప్రధానికి వివరించనున్నామని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్, ఆ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు.
చట్టపరంగా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకున్నామని శశికళ నటరాజన్ వర్గం భావిస్తోంది. అయితే స్టాలిన్ మాత్రం తమిళ ప్రజల అకాంక్షలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. అదే అజెండాగా ప్రధాని నరేంద్ర మోడీతో ఎంకే. స్టాలిన్ చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications