వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

STARBUCKS: ‘‘మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు’’- కార్మిక సంఘాలతో కలిసి పని చేస్తున్నందుకు ఇది శిక్షా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జోసెలిన్ చుఖిల్లాంఖ్వి

అమెరికాలోని దాదాపు 200 స్టార్‌బక్స్ స్టోర్‌ల సిబ్బంది యూనియన్‌గా ఏర్పడి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఊహించని స్పందన వస్తోంది.

జోసెలిన్ చుఖిల్లాంఖ్వి దాదాపు ఏడేళ్లుగా స్టార్‌బక్స్ లో పనిచేస్తున్నారు. కానీ, గత వారం ఆమెను విధుల నుంచి తొలగించారు.

ఆమెకు ఈ ఉద్యోగం అంటే ఇష్టమే. తన మేనకోడలిని చూసుకునేందుకు ఆమెకు తగిన సమయం కూడా దొరకుతోంది. అయితే, కోవిడ్-19 వ్యాప్తి నడుమ సిక్ లీవ్‌లను తగ్గించాలని సంస్థ నిర్ణయం తీసుకోవడంతో.. దీనిపై పోరాడేందుకు తోటి సిబ్బందితో కలిసి న్యూయార్క్‌లో ఒక కార్మిక సంఘంలో చేరాలని ఆమె భావించారు.

అయితే, దీనికి పైఅధికారుల ఆగ్రహాన్ని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ''ఇతరులు చేసినప్పుడు పట్టించుకోని చిన్నచిన్న లోటుపాట్లను కూడా నా విషయంలో అధికారులు ప్రధానంగా ప్రస్తావించే వారు. ఉదయం 5.30 షిఫ్టుకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చానని కూడా ప్రశ్నించేవారు’’అని ఆమె చెప్పారు.

గత జులైలో స్టోర్ తాళం కనిపించకుండా పోయింది. దీన్ని ఎక్కడ పెట్టారో ఆమె మరచిపోయారు. ఈ విషయాన్ని వెంటనే ఆమె మేనేజర్‌కు చెప్పారు. అయితే, కాసేపు వెతికిన తర్వాత స్టోర్‌లోనే ఆ తాళం దొరికింది.

స్టార్‌బక్స్

ఆమెను ఉద్యోగం నుంచి తొలగించే సమయంలో పనిని వేగంగా చేయడంలేదని, తాళం చెవి కూడా పోగొట్టారని పైఅధికారులు తెలిపారు.

2015 నుంచి జోసెలిన్ స్టార్‌బక్స్‌లోనే పనిచేశారు. షిఫ్ట్ సూపర్‌వైజర్‌గా ఆమె పనిచేసేవారు. గంటకు 22 డాలర్లు (రూ.1700) వరకు సంపాదించేవారు. ''ఇది కచ్చితంగా ప్రతీకార చర్యే. మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చారని ఇలా ఉద్యోగం నుంచి తీసేయడం నేనెక్కడా చూడలేదు’’అని ఆమె చెప్పారు.

జోసెలిన్‌తోపాటు ఇలా కార్మిక సంఘాల్లో క్రియాశీలంగా పాల్గొనేందుకు ప్రయత్నించిన 75 మంది సిబ్బందిని తొలగించినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

మొత్తంగా అమెరికాలో దాదాపుగా 9,000 స్టార్‌బక్స్ స్టోర్‌లు ఉన్నాయి. అయితే, సిబ్బందిపై ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారనే వార్తలను సంస్థ ఖండిస్తోంది. కార్మికులు సంఘంగా ఏర్పడే హక్కును తాము గౌరవిస్తామని చెబుతోంది.

''మా సిబ్బందికి మూడో సంస్థ నేతృత్వం వహించడం మాకు ఇష్టంలేదు. మా సిబ్బంది మనసులు గెలుచుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. దీనిలో కచ్చితంగా విజయం సాధిస్తాం’’అని గత జూన్‌లో సంస్థ అధిపతి హోవర్డ్ స్కల్ట్స్ అన్నారు.

హోవర్డ్ స్కల్ట్స్

విలువల కోసం

బ్రూక్లిన్‌లోని కార్మికుల కుటుంబంలో జన్మించిన హోవర్డ్ తన కెరియర్‌లో ఇలాంటి చాలా కార్మిక ఉద్యమాలను చూశారు. 1987 నుంచి 2000 మధ్య కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఆయన పనిచేశారు. 2008లో సంస్థను అంతర్జాతీయ గుర్తింపు వచ్చే స్థాయికి తీసుకెళ్లారు.

ఆయన తర్వాత సీఈవోగా కెవిన్ జాన్సన్ బాధ్యతలు తీసుకున్నారు. కార్మిక ఉద్యమం నడుమ ఆయన రాజీనామా చేయడంతో మళ్లీ హోవర్డ్ బాధ్యతలు తీసుకున్నారు. సంస్థ, సిబ్బంది మధ్య సంబంధాలు మెరుగు పరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ విషయంలో సీనియర్ మేనేజ్‌మెంట్ సిబ్బందితో వరుసగా సమావేశాలు ఏర్పాటుచేసింది. కార్మిక సంఘాల్లో చేరకుండానే సమస్యలు పరిష్కరించొచ్చని చెప్పేందుకు ప్రయత్నించింది.

జీతాల పెంపు కోసం 1 బిలియన్ డాలర్లు (రూ.7,934 కోట్లు) పెట్టుబడిగా పెడుతున్నట్లు సంస్థ ప్రకటించింది. మరోవైపు కనీస వేతనాన్ని గంటకు 15 డాలర్ల (రూ.1,190) నుంచి 17 డాలర్లుకు(రూ.1,350కు) పెంచుతున్నట్లు వెల్లడించింది.

''విజయాలను, ఫలితాలను అందరితోనూ పంచుకోవడం మా ప్రధాన విలువల్లో ఒకటి. గత 50ఏళ్లుగా మేం దీన్ని కొనసాగిస్తున్నాం’’అని హోవర్డ్ చెప్పారు. ''బయటి వ్యక్తుల ప్రమేయం వల్ల మా విలువలు ఏమీ మారవు’’అని ఆయన అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కార్మిక సంఘాల్లో చేరిన స్టార్‌బక్స్ సిబ్బంది సంఖ్య చాలా తక్కువ. ముఖ్యంగా చిలీలోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

కావాలనే చేస్తున్నారా?

అయితే, స్టార్‌బక్స్ తాజా ప్రకటనలు తమ పోరాటాల వల్లే వచ్చాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఆర్థిక వృద్ధి వేగం మందగించింది. మరోవైపు స్టార్‌బక్స్‌పైనా ఒత్తిడి పెరిగింది.

న్యూయార్క్‌లోని ఇథాకా స్టార్‌బక్స్ స్టోర్‌లో 20ఏళ్ల ఎవన్ సన్‌షైన్ పనిచేసేవారు. గత ఏప్రిల్‌లో కార్మిక సంఘంలో చేరేందుకు ఇక్కడి సిబ్బంది అంగీకారం తెలిపారు. కానీ, ఇప్పుడు ఈ స్టోర్‌ను స్టార్‌బక్స్ ఏకంగా మూసేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే చర్యలు తీసుకున్నట్లు సంస్థ చెబుతోంది.

అయితే, కార్మిక సంఘం సాయంతో ఎవన్ మరో స్టోర్‌లో ఉద్యోగం సంపాదించారు. ''కానీ చాలా మంది సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల కార్మిక సంఘాల్లో చేరాలంటే ఇతర స్టోర్‌ల సిబ్బంది భయపడుతున్నారు’’అని ఆయన చెప్పారు.

అయితే, కార్మిక చట్టాలను సంస్థ ఉల్లంఘిస్తోందని స్టార్‌బక్స్ వర్కర్స్ యునైటెడ్ యూనియన్ ఆరోపిస్తోంది. నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు (ఎన్ఎల్ఆర్‌బీ)లో దీనిపై కేసులు కూడా నమోదుచేసింది.

మొత్తంగా 16 కేసులపై ఎన్ఎల్ఆర్‌బీ విచారణ చేపడుతోంది. కొన్ని కేసుల్లో విధుల్లో నుంచి తొలగించిన సిబ్బందిని వెంటనే మళ్లీ తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే, సిబ్బంది, కార్మిక సంఘాలు అవకతవకలకు పాల్పడుతున్నాయని స్టార్‌బక్స్ ఆరోపిస్తోంది.

హోవర్డ్ స్కల్ట్స్

అమెరికాలోని కొన్ని కంపెనీలు చట్టాలకు వ్యతిరేకంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయని కార్నెల్ యూనివర్సిటీకి చెందిన లేబర్, ఎంప్లాయిమెంట్ లా ప్రొఫెసర్ రీసా లీబెర్‌విట్జ్ చెప్పారు. ఈ ఉల్లంఘనలకు విధించే శిక్షలు, జరిమానాలు కూడా చాలా తక్కువని ఆమె అన్నారు.

అయితే, ఇలాంటి వివాదాల వల్ల బ్రాండ్‌పై ప్రభావం పడుతుందని ఆమె వివరించారు.

''ప్రజల అభిప్రాయాలు చాలా ముఖ్యం. దేశవ్యాప్తంగా స్టోర్‌లను ఏర్పాటుచేసినప్పుడు దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా వైరుద్ధ్యాలు కనిపిస్తే, కంపెనీ బ్రాండ్‌పై ప్రభావం పడుతుంది’’అని ఆమె చెప్పారు.

ప్రస్తుతం తన మేనేజర్ తనపై వదంతులు వ్యాపింపజేస్తున్నారని జోసెలిన్ చెబుతున్నారు. ''కార్మిక సంఘాల నుంచి నాకు డబ్బులు వస్తాయని ఆరోపిస్తున్నారు. నాతో కలిసి పనిచేసేవారికి పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు ఉండవని బెదిరిస్తున్నారు’’అని ఆమె చెబతున్నారు.

''ఇలాంటి వార్తలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తోంది. సిబ్బంది బలహీనతలు, అవసరాలను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతున్నారు. తాము అలా విజయం సాధిస్తున్నామని అనుకుంటున్నారు’’అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
STARBUCKS: 'Fired for Being Three Minutes Late' - Punishment for Working with Unions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X