వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రైళ్లు ప్రారంభానికి నోచుకున్న ప్రతీసారీ ఈ దాడులు తప్పట్లేదు. గతంలో సికింద్రాబాద్- విశాఖపట్నం, అహ్మదాబాద్-ముంబై, తిరువనంతపురం-కాసర్‌గాడ్, చెన్నై- మైసూరు.. ఇలా దాదాపు అన్ని మార్గాల్లో ప్రయాణించే వందే భారత్ రైళ్లపై దాడులు జరిగాయి.
ఇప్పుడు తాజాగా బెంగళూరు- ధార్వాడ మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పైనా రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ రైలుపై రాళ్లు విసిరారు. బెంగళూరు నుంచి ధార్వాడ్ బయలుదేరిన నంబర్ 20661 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై ఈ రాళ్ల దాడి జరిగింది. మార్గమధ్యలో కడూర్ స్టేషన్ దాటిన కొద్దిసేపటికి ఈ ఘటన సంభవించింది.

కరూర్ దాటి.. బిరూర్ వైపు వెళ్తోన్న సమయంలో ఈ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కిటికీ అద్దాలు పగిలినట్లు నైరుతి రైల్వే అధికారులు వెల్లడించారు. కిందటి నెల 27వ తేదీన ప్రారంభమైన ఈ రైలుపై రాళ్లు రువ్విన ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ రైలుకు మంచి డిమాండ్ ఉంటోంది. 90 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంటోంది.
ప్రతిరోజూ తెల్లవారు జామున 5:45 నిమిషాలకు క్రాంతివీర సంగోళి రాయన్న బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచి ధార్వాడకు బయలుదేరే ఈ రైలు మధ్యాహ్నం 12:40 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 1:15 నిమిషాలకు మళ్లీ ధార్వాడ నుంచి బయలుదేరి రాత్రి 8:10 నిమిషాలకు కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్‌కు చేరుకుంటుంది.
ఎనిమిది కోచ్‌లు ఉండే మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. క్రాంతివీర సంగోళి రాయన్న బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు గదగ్, హుబ్బళ్లి మీదుగా ధార్వాడకు చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణ సమయం సుమారుగా 12 గంటలు. వందే భారత్ వల్ల ఏడు గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కర్ణాటకలో రాకపోకలు సాగించే రెండో వందే భారత్ ఇదే.












Click it and Unblock the Notifications