ట్విట్టర్: టాప్‌లో మోడీ, బిజెపి, తర్వాతే కేజ్రి, రాహుల్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో మోస్ట్ పాపులర్ రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల సీజన్లో అత్యధికంగా మంది ట్విట్టర్ యూజర్లు మోడీ గురించే చర్చించుకుంటున్నారు. సింప్లిఫై 360 అనే ప్రైవేటు వ్యాపార సంస్థ నిర్వహించిన ఓ సర్వేలే ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఈ సర్వేలో పాపులారిటీని బట్టి సింప్లిఫై సోషల్ ఇండెక్స్(ఎస్ఎస్ఐ) పేరుతో ర్యాంకింగ్స్ కేటాయించింది. ట్విట్టర్‌తోపాటు ఇతర సోషల్ ప్లాట్‌ఫాంలపై ఏ రాజకీయ నాయకుల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు, ఏ నాయకుడిపై ఎంతమంది అవగాహన కలిగి ఉన్నారు, అతని చిత్రాలు, వీడియోలను ఎంతమంది అతనికి మద్దతుగా షేర్ చేస్తున్నారనే అంశాలపై సింప్లిఫై 360 అధ్యాయనం చేసింది.
నరేంద్ర మోడీకి సింప్లిఫై సోషల్ ఇండెక్స్(ఎస్ఎస్ఐ) 76వ ర్యాంకును ఇచ్చింది. 2014 మార్చి నెలలో మోడీ గురించి 1,97,902 లక్షల మంది చర్చించుకున్నారని సోషల్ మీడియా బజ్ విశ్లేషణ పేర్కొంది. మోడీ ప్రేరిత ట్విట్టర్ సందేశాలు మార్చి నెలలో మొత్తంగా చూసుకున్నట్లయితే 15,29,796 ఉన్నాయి.

కాగా, మోడీ తర్వాతి స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఉన్నారు. ఆయనకు 73వ ఎస్ఎస్ఐ ర్యాంక్ లభించింది. కేజ్రివాల్‌పై మార్చి నెలలో 2,20, 069 లక్షల మంది చర్చించుకున్నారు. కేజ్రివాల్ సృష్టించిన మొత్తం సందేశాలు 20,14,259 ఉన్నట్లు సర్వే పేర్కొంది.
ఎస్ఎస్ఐ 72వ ర్యాంకుతో మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నారు. 79,713 మంది ప్రజలు రాహుల్ గాంధీ గురించి ట్విట్టర్‌లో చర్చించుకుంటున్నారు. మార్చి నెలలో రాహుల్ సృష్టించినవి మొత్తం 3,29,180 ఉన్నాయని తెలిపింది. ఎస్ఎస్ఐ 71వ ర్యాంకుతో రాహుల్ గాంధీ తల్లి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాల్గవ స్థానంలో నిలిచారు.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ 68, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ 66వ ర్యాంకులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరో ముగ్గురు కూడా ఈ జాబితాలో చేరారు. ఎన్‌సిపి నాయకుడు శరద్ పవార్ 65, ఆప్ నాయకుడు యోగేంద్ర యాదవ్ 64, బిజెపి నేత అరుణ్ జైట్లీ 64వ ర్యాంకులలు సాధించారు. విశేషమేమిటంటే మార్చి నెలలో సోషల్ బజ్‌లో ఎక్కువ రేటును నమోదు చేసిన అరవింద్ కేజ్రివాల్.. నరేంద్ర మోడీని వెనక్కి నెట్టి సంచలనం సృష్టించాడు.
ట్విట్టర్: బిజెపి తర్వాతే కాంగ్రెస్, ఆప్
ఈ ఎన్నికల సీజన్లో సింప్లిఫై 360 సంస్థ రాజకీయ పార్టీలపై నిర్వహించిన అధ్యయనంలో ట్విట్టర్‌లో మోస్ట్ పాపులర్ పార్టీగా బిజెపి అవతరించింది. పార్టీలపై అవగాహన, ప్రాధాన్యత, ఇష్టత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న ఈ సంస్థ తన అధ్యయనాన్ని పూర్తి చేసింది. బిజెపి గురించి 2,10,105 మంది ప్రజలు చర్చించుకున్నారని, ఆ పార్టీ సృష్టించిన సందేశాల సంఖ్య 21,16, 562గా ఉందని సంస్థ పేర్కొంది. దీంతో బిజెపికి 74వ ర్యాంక్ ఇచ్చింది.

73వ ర్యాంకుతో కాంగ్రెస్ పార్టీ తర్వాతి స్థానంలో నిలిచింది. 1,24,633 మంది ప్రజలు మార్చిలో కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకోగా, కాంగ్రెస్ సృష్టించిన సందేశాల సంఖ్య 4,79,477గా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 72వ ర్యాంకుతో మూడవ స్థానంలో ఉంది. ఆప్ గురించి 1,09,097 ప్రజలు చర్చించుకోగా.. ఆ పార్టీ సృష్టించిన సందేశాల సంఖ్య 8,05,092గా ఉంది. ఎన్‌సిపి, బిఎస్‌పి, డిఎంకె వరుసగా నాలుగు, ఐదు, ఆరవ స్థానాల్లో నిలిచాయి. ఫేవరబిలిటీని పరిగణలోకి తీసుకున్నట్లయితే బిఎస్‌పి టాప్‌లో ఉండగా.. కాంగ్రెస్ తర్వాతి స్థానంలో ఉంది.












Click it and Unblock the Notifications