పీవీకి భారతరత్న ఇవ్వాలి: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్
న్యూఢిల్లీ: దివంగత పీవీ నర్సింహా రావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం డిమాండ్ చేశారు. పీవీ పదో వర్ధంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని, ప్రసంగించారు.
పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారత దేశాన్ని ప్రబల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారన్నారు. ఆయనకు భారతరత్న పురస్కారం అందచేయాల్సిందే అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో పలువురు పీవీకి నివాళులు అర్పించారు.

పీవీ ప్రభుత్వంలో కార్మిక ప్రమాణాలు, అంతర్జాతీయ వాణిజ్యం పైన ఏర్పాటైన కమిషన్‌కు చైర్మన్‌గా సుబ్రహ్మణ్య స్వామి వ్యవహరించారు. కాగా, నెహ్రూ కుటుంబం కాకుండా భారత ప్రధానికి ఐదేళ్లు (1991-1996) పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెస్ వ్యక్తి పీవీ నర్సింహా రావు కావడం గమనార్హం.
వాజపేయికి భారతరత్న ఇవ్వాల్సిందే: నితీశ్
భారతీయ జనతా పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయికి భారతరత్న ఇవ్వాలన్న ఆ పార్టీ డిమాండ్‌ను జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ సమర్ధించారు. యుపీఏ హయాంలోనే వాజపేయికి భారతరత్న ఇచ్చి ఉండాల్సిందని, ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం అందజేయడం అన్ని విధాలా సముచితమని తన మద్దతు ప్రకటించారు. కాగా, వాజపేయి, మదన్ మోహన్ మాలవ్యాలకు బుధవారం కేంద్రం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications